ముంపు బాధితులను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బాపట్ల రాజీవ్‌గాంధీ కాలనీలో భాగమైన ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది.

Published : 06 Dec 2023 05:22 IST

పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా

బాపట్ల, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బాపట్ల రాజీవ్‌గాంధీ కాలనీలో భాగమైన ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది. ఇక్కడి బాధిత మహిళలకు భరోసా కల్పించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వారితో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. ముంపు ప్రాంతంలో ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు నరేంద్రవర్మ పర్యటించారు. చంద్రబాబుకు ఆయన్‌ ఫోన్‌ చేసి తుపాను వల్ల బాపట్లలో తలెత్తిన విపత్కర పరిస్థితులను వివరించారు. బాధిత మహిళల చేత చంద్రబాబుతో మాట్లాడించారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్నామయ్యా..

‘తుపాను ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులకు గజగజ వణికిపోయాం. వర్షపు నీరు మా గుడిసెలను ముంచెత్తింది. ఇంట్లో సామానులు, దుస్తులు తడిసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామయ్యా..’ అంటూ చంద్రబాబుకు ఆ మహిళలు తమ గోడును వినిపించారు. తమను ఆదుకోవాలని ఆయనకు వారు విజ్ఞప్తి చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, తెదేపా ద్వారా బాధితులకు ఆహారం, నిత్యావసరాలు అందజేసి నరేంద్రవర్మ ఆదుకుంటారని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని