ఏపీ అప్పు రూ.11.28 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు.

Updated : 07 Dec 2023 05:42 IST

రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో బుధవారం దేశ ఆర్థిక వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.11,28,992 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల తరఫున స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ని ఏర్పాటుచేసి వాటి ద్వారా అప్పులు తీసుకుంటూ ప్రభుత్వం తీసుకొనే రుణాలు నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకుంటోంది. ఇలాంటి అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లించకూడదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచే చెల్లిస్తోంది. దీనివల్ల ఏపీ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘోరమైన ఆర్థిక తప్పులు చేస్తోందని కాగ్‌ కూడా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి నాటికి అసెంబ్లీకి చెప్పకుండా రూ.1.20 లక్షల కోట్లు తీసుకున్నట్లు కాగ్‌ వెల్లడించింది. కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల గురించి చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసినట్లు కాగ్‌ ఆరోపించింది’ అని కనకమేడల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని