రూ.1,233 కోట్ల కేటాయింపులు ఎవరికి దోచిపెట్టడానికి?

‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్‌రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్‌ అయిన మూడు నెలల్లో బడ్జెట్‌లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా?

Published : 07 Dec 2023 04:55 IST

తిరుపతి పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా రూ.80 కోట్లు ఇవ్వడానికి మీరెవరు?
తితిదే నిధులతో అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారమా?
తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్‌రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్‌ అయిన మూడు నెలల్లో బడ్జెట్‌లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా? ఇవి ఎవరికి దోచిపెట్టడానికి’ అని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. తిరుపతిలో పారిశుద్ధ్య నిర్వహణకు తితిదే నుంచి దొడ్డిదారిలో రూ.80 కోట్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇది కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికేనా అని నిలదీశారు. ఇలా ఏటా నిధులివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని చెప్పడానికి దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఎవరని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2023-24లో తితిదే మొత్తం బడ్జెట్‌ రూ.4,411 కోట్లు. ఇందులో ఇంజినీరింగ్‌ పనులకు కేటాయించింది కేవలం రూ.300 కోట్లు. జూన్‌ నాటికి దీన్ని రూ.542 కోట్లకు పెంచారు. సెప్టెంబరులో కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌ కాగానే ఈ మూడు నెలల్లో రూ.1,233 కోట్ల విలువైన పనుల్ని కేటాయించారు. గతంలో ఏ ఛైర్మన్‌ హయాంలోనూ తీసుకోని నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌ అయ్యాకే ఎందుకు తీసుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘2021-22 తర్వాత తితిదే బోర్డు మంజూరు చేసిన కాంట్రాక్టు పనుల వివరాలు, ఆర్థిక కార్యకలాపాల్ని సంబంధిత వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచలేదు? ఈ ఏడాది జూన్‌ తర్వాత తీసుకొన్న బోర్డు తీర్మానాలను ఎందుకు బహిరంగపరచరు? పారదర్శకత అవసరం లేదా’ అని మండిపడ్డారు.

దేవుడికి రెండో ప్రాధాన్యం

‘వైకాపా ప్రభుత్వం వచ్చాక దేవస్థానంలో రాజకీయాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, దేవుడికి రెండో స్థానం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే తితిదేలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేయిస్తాం’  అని విజయ్‌ తెలిపారు. రూ.75 కోట్ల దేవుడి సొమ్ముతో నిర్మించిన పద్మావతీ నిలయంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా అద్దె కట్టడం లేదని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు