చంద్రబాబుతో పవన్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది.

Published : 07 Dec 2023 04:57 IST

ఉమ్మడి కార్యాచరణపై విస్తృత చర్చ

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య పొత్తు ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడం, ఉమ్మడి ఎజెండాను పటిష్ఠంగా అమలు చేయడంపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. సమావేశం వివరాల్ని గోప్యంగా ఉంచారు.  నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు బెయిల్‌పై వచ్చాక... వారిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి. నవంబరు 4న చంద్రబాబుతో ఆయన నివాసంలో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. రెండు పార్టీల పొత్తు పటిష్ఠం దిశగా ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లడం, రెండు పార్టీలూ ప్రతిపాదించిన అంశాలతో మినీ మ్యానిఫెస్టోను రూపొందించడం, జిల్లా, నియోజకవర్గ స్థాయుల్లో ఇరు పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు నిర్వహించడం వంటి పలు కీలక నిర్ణయాల్ని అప్పట్లో తీసుకున్నారు. ఆ వెంటనే ఆచరణలోనూ పెట్టారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల పురోగతి, రెండు పార్టీలూ కలిసి జనం వద్దకు వెళ్లినప్పుడు వారి నుంచి వస్తున్న స్పందన, తెదేపా, జనసేన శ్రేణుల మధ్య మరింత విస్తృత సమన్వయానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై బుధవారంనాటి సమావేశంలో చర్చ జరిగినట్లు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్టు తెలిసింది. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సభను విశాఖ జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానిలో చంద్రబాబుతోపాటు, పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొంటారని తెదేపా నేతలు చెబుతున్నారు. పాదయాత్ర అంశం కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో అగ్రనేతలిద్దరూ చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని