సమన్వయం పెంచుకుందాం

కూటమిలోని పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు నిర్ణయించారు.

Published : 07 Dec 2023 05:36 IST

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుదాం
‘ఇండియా’ కూటమి నేతల నిర్ణయం
ఖర్గే నివాసంలో విందు భేటీ

దిల్లీ: కూటమిలోని పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాలను భాజపా కైవసం చేసుకోవడంపై సమీక్షించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయంపై చర్చించారు. ఉమ్మడి ర్యాలీలపై ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విందు భేటీకి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. తృణమూల్‌ నుంచి ఎవరూ రాలేదు. కారణాలనూ ఆ పార్టీ వెల్లడించలేదు. ఈ భేటీలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, అధీర్‌ రంజన్‌ చౌధరితోపాటు జేఎంఎం, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ, జేడీయూ, సమాజ్‌వాదీ, ఆర్‌ఎల్‌డీ, ఎన్సీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, సీపీఎం, ఆర్జేడీ, కేరళ కాంగ్రెస్‌ (ఎం), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. 

వ్యూహాలను ఖరారు చేయాలి: నీతీశ్‌

పట్నా: భవిష్యత్తు కార్యాచరణ వ్యూహాలను ఇండియా కూటమి త్వరగా ఖరారు చేయాల్సి ఉందని జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. 3 రాష్ట్రాల్లో భాజపా విజయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల మూడో వారంలో జరగనున్న ఇండియా కూటమి భేటీపైన దృష్టి సారించానని తెలిపారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచిందని, ఈసారి భాజపా గెలిచిందని, తెలంగాణలో తాజాగా కాంగ్రెస్‌ మంచి ఫలితం సాధించిందని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడంవల్ల బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కాలేకపోయానని, మూడో వారంలో జరిగే భేటీకి హాజరవుతానని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని