ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?

గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది.

Published : 08 Dec 2023 09:22 IST

ఎమ్మెల్యే సుచరితను నిలదీసిన మహిళలు

కాకుమాను, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది. స్థానిక మహిళలు.. ఎస్సీ కాలనీలో ఆమె కారును అడ్డగించి సమస్యలపై నిలదీశారు. తాము ఓట్లు వేసి గెలిపించాక.. ప్రజాప్రతినిధులెవరూ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, ఇళ్లలోకి వాననీరు చేరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారనే సమాచారమూ చెప్పలేదన్నారు. ఏళ్లుగా తాము ఇబ్బందులు పడుతుంటే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు వచ్చారా అంటూ ప్రశ్నించారు. కాలనీలో రహదారులు నిర్మించలేదని, మురుగు కాలువలో పూడిక కూడా తీయడం లేదన్నారు. కావాలనే.. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కొంతమంది నాయకులు వారిని ఆపే ప్రయత్నం చేయగా సమస్యలను కూడా చెప్పుకోనివ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడ్డ తమకు న్యాయం చేయాలని ఓ మహిళ ఎమ్మెల్యేను కోరగా, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆర్థికసాయం మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని