వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్‌ను మీరు నాశనం చేసుకున్నట్లే.

Updated : 08 Dec 2023 06:52 IST

ఏపీ బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తును గెలిపించండి
సంక్షేమ కార్యక్రమాలను ఇంకా పెంచి కొనసాగిస్తాం
విశాఖ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌


దశాబ్ద కాలంగా ఓడినా మీ ముందు నిల్చున్నానంటే అది మీ భవిష్యత్‌ కోసం. ఓటమి విలువ యువతకు బాగా తెలుసు. ఓటమి మీద ఓటమి వస్తున్నా.. సవాల్‌గా తీసుకుని ఎదుగుతూనే ఉన్నా. దొడ్డి దారుల్లేవు.. నిలబడి చూపించడమే నాయకత్వం. ఇందుకు అబ్రహాం లింకన్‌ నాకు ఆదర్శం

 పవన్‌ కల్యాణ్‌


ఈనాడు-విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్‌ను మీరు నాశనం చేసుకున్నట్లే. వైకాపా దుష్టపాలనను ఇంకా మూడు నెలలే భరిద్దాం’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గురువారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ఆళ్వార్‌దాస్‌ స్టేడియంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి విజయ్‌కుమార్‌ సోదరుడు, గుత్తేదారు సుందరపు వెంకట సతీష్‌కుమార్‌ జనసేనలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

‘విశాఖ నాలో ధైర్యాన్ని నింపి పార్టీని ముందుకు నడిపించే స్థాయికి తీసుకొచ్చింది. ఆ ధైర్యమే రేపు తెదేపా-జనసేన కూటమిని నిలబెడుతుంది’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘2014లో తెదేపా, భాజపాకు అండగా ఉంటే విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించా. 2019లో దురదృష్టవశాత్తూ కలవలేదు, 2024 ఎన్నికలకు మాత్రం ఏపీకి బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని పొత్తు పెట్టుకుంటున్నాం. ఏపీ బాగుండాలంటే ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం ఇవ్వాలి. మరోసారి వైకాపాకు ఆ ఛాన్స్‌ ఇవ్వదలుచుకోలేదు. మరో అయిదేళ్లు యువత భవిష్యత్‌ను తాకట్టు పెట్టలేను. అవసరమైతే నన్ను నేను తగ్గించుకుంటా’ అని పేర్కొన్నారు.

గుండెల్లో అభిమానం ఓట్లలో చూపిస్తేనే: ‘మనం పోటీ చేసే స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా మనం మద్దతిచ్చిన స్థానాల్లోని అభ్యర్థులకు బలమైన మెజార్టీ ఇవ్వాలి. మీ గుండెల్లో ఉన్న అభిమానం ఓట్లలో చూపించకపోతే ప్రయోజనం లేదు. ఎక్కువమంది ఎమ్మెల్యేలను గెలిపించి, అధిక శాతం ఓట్లు తెదేపాకు బదిలీ అయితే మంచి స్థాయిలో మనం ఉంటాం. సీఎం ఎవరనేది నేను, చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం. అది మీకు చెప్పే చేస్తా. లోపాయికారిగా ఏమీ చేయను. నేను ఎవరికీ ‘బి’ పార్టీ కాదు. జనసేన తెదేపా వెనుక నడిచేది కాదు.. కలిసి నడిచేది. నన్ను అభిమానించే వీర మహిళలు, జనసైనికుల అభిమానం కాపాడుతా’ అంటూ సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తున్న అభిమానులను ఉద్దేశించి పవన్‌ మాట్లాడారు.

జగన్‌ ఓటు అనే బోటుపై సముద్రం దాటి తెప్ప తగలేశాడు

‘రాబోయే మూడు నెలలూ వ్యక్తిగతంగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం పొరపొచ్చాలు లేకుండా తెదేపాతో కలిసి పోరాడండి. పొత్తు గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వైకాపాకు అమ్ముడుపోయినట్లే. నా చుట్టూ తిరగకుండా, ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాలి. ఓటరును ఇంటి నుంచి పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకు రావాలి. 2024లో తెదేపా-జనసేనలు అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తాం. ఇంకా రూ.పది ఎక్కువే ఇస్తాముగానీ కోత విధించం. జగన్‌ ఓటు అనే బోటు మీద సముద్రం దాటాడు. ఆ వెంటనే తెప్ప తగలేశాడు. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రకృతిని నాశనం చేసి సంపాదించిన డబ్బుతో జగన్‌ మీ విలువైన ఓటును కొనేస్తాడు. రూ.2 వేలిచ్చినా రూ.3 వేలిచ్చినా ఆ డబ్బు జగన్‌ జేబులోది కాదు. ఆ డబ్బుకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. ఈసారి ఓటు సుస్థిర, బలమైన మార్పు కోసం వేయండి’ అని పవన్‌ పిలుపునిచ్చారు.

అత్తారింటికి దారేదిలా.. ఏపీ రాజధానికి దారేది?

‘విభజన తర్వాత పదేళ్లైనా రాష్ట్ర రాజధాని ఎక్కడుంది? అత్తారింటికి దారేది సినిమా కథను మూడు గంటల్లో చెప్పేయొచ్చు. ఏపీ రాజధానికి దారేది..? అంటే ఎవరూ చెప్పలేరు. ప్రతిసారీ దిల్లీ నుంచి ఎవరో ఒకరు గుర్తుచేయాల్సి వస్తోంది. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నా. స్టీల్‌ప్లాంటు విషయంలోనూ అలాగే నిలబడతా. దీనిపై అమిత్‌షాకు ఇప్పటికే తెలియజేశా. అందుకే ప్రైవేటీకరణ ఆగింది. జనసేనకు మద్దతుగా నిలబడితే స్టీల్‌ప్లాంటు కోసం నా సర్వశక్తులతో అండగా ఉంటా’ అని జనసేనాని భరోసా ఇచ్చారు.

రావోయి మా రాష్ట్రానికి.. ఈజీగా గంజాయి దొరుకుతాది!

‘రావోయి మా కంట్రికి.. నువ్వు తిననీకి బ్రౌన్‌ షుగరు మందున్నాది. నువ్వు తాగనీకి సర్కారు సారా ఉన్నది’ అని జానీ సినిమాలో నేను పాట పాడా. సెన్సార్‌ నేపథ్యంలో ‘రావోయి మా ఇంటికి బొంబాట లైఫ్‌ ఉన్నది’గా మారింది. ఈ రోజు ఆ పాట పాడమంటే.. ‘రావోయి మా రాష్ట్రానికి. ఈజీగా గంజాయి దొరుకుతుంది. నువ్వు తాగడానికి బోలెడంత సర్కారు సారా ఉంటుంది’ అనొచ్చు. బ్రౌన్‌ షుగరు, గంజాయి, మద్యంతో రూ.వేల కోట్లు కూడబెట్టారు. జగన్‌కు డబ్బులు పెరిగిపోయి.. ప్రజలు ఏం తినాలి? ఏం ధరించాలి? అనేవి కూడా నిర్దేశించే స్థాయికి వెళ్లారు’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

అలాంటి చిల్లర పనులకు అధికారులను వాడుకోం

‘పోలీసు వ్యవస్థను రాజకీయ పార్టీలకు గూండాల్లా వాడుకోకూడదు. తెదేపా, జనసేన అధికారంలోకి వస్తే లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటుంది. బలమైన పోలీసు అధికారులు, చట్టానికి లోబడి పనిచేసే వారినే తీసుకొస్తాం. నా సినిమాలను ఆపేందుకు అధికారులు థియేటర్ల వద్ద కాపాలా కాశారు. అలాంటి చిల్లర పనులకు వారిని మేం వాడుకోం. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి. మత్స్యకారులకు ప్రతి 30 కి.మీ.లకు ఒక జెట్టీ ఉండేలా కృషి చేస్తాం. ఏపీలో బీసీ జాబితాలో ఉన్న 29 కులాలను తెలంగాణలో బీసీ జాబితాలో నుంచి తీసేశారు. 151 ఎమ్మెల్యేలను ఇచ్చినా వైకాపా నాయకులు ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించ లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఒకరికొకరు సహకరించుకున్న నాయకులు దానిపై కనీసం ఆలోచించలేదు’ అని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, తెదేపా, జనసేన ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని