సుపరిపాలన భాజపాకే సాధ్యం

సుపరిపాలనను భాజపా మాత్రమే అందించగలదని దేశ ప్రజలు భావిస్తున్నందునే ఆ పార్టీ ప్రభుత్వాలకు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 08 Dec 2023 04:51 IST

అందుకే అత్యధిక రేటింగ్‌తో ప్రజలు మెచ్చారు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న వాస్తవం ఇదే
పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోదీ విశ్లేషణ

దిల్లీ: సుపరిపాలనను భాజపా మాత్రమే అందించగలదని దేశ ప్రజలు భావిస్తున్నందునే ఆ పార్టీ ప్రభుత్వాలకు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ వాస్తవం సుస్పష్టమవుతుందని పేర్కొన్నారు. ప్రజల మెప్పు పొంది మళ్లీ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల కన్నా భాజపా రికార్డు అత్యంత మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. దిల్లీలో గురువారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో సాధించిన విజయాల ఘనతను ఏ ఒక్క నేతకో ఆపాదించరాదని, జట్టు స్ఫూర్తితో ఉమ్మడిగా సాధించినవిగా గుర్తించాలని తెలిపారు. ప్రత్యేకించి మోదీ ఘనతగా చెప్పొద్దని ఎంపీలకు సూచించారు. దేశంలో భాజపా పాలన మెరుగ్గా ఉండటంతో మూడు రాష్ట్రాల్లో ప్రజలు పార్టీకి పట్టం కట్టారని, తెలంగాణ, మిజోరంలలో పార్టీ బలోపేతమైందని వివరించారు.

ప్రధానికి ఘన సత్కారం

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీకి  సభ్యులంతా నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు మూడు రాష్ట్రాల్లో కమలాన్ని విజయతీరాలకు చేర్చిన ఘనత ప్రధానిదే అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రధానిని ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభకు వెళ్లినప్పుడు కూడా భాజపా ఎంపీలు అందరూ నిలుచుని, బల్లలు చరుస్తూ స్వాగతించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఇదే విషయంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందిస్తూ...‘ఈ రోజు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నాను. మూడు రాష్ట్రాల్లో భాజపా గెలుపుతో కార్యకర్తలంతా ఉత్సాహంగా ఉన్నారు. భవిష్యత్తులోనూ మరింతగా కష్టపడతాం. పేద, అణగారిన, అట్టడుగు వర్గాల సాధికారతకు కృషి చేస్తాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం’ అని పేర్కొన్నారు.

అత్యధిక విజయాలు భాజపావే

‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 40  అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొంటే...ఏడు దఫాలు మాత్రమే విజయం సాధించగలిగింది. కాంగ్రెస్‌ గెలుపు 18శాతం మాత్రమే’నని ప్రధాని మోదీ సమావేశంలో వివరించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. ‘భాజపా అధికారంలో ఉన్న సమయంలో 39 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 22 సార్లు జయకేతనం ఎగురవేసింది. గెలుపు 56శాతంగా ఉంద’ని వివరించారు. ‘అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు 36 ఎన్నికలను ఎదుర్కొని 18 విజయాలు నమోదు చేశాయి. ఆ పార్టీల గెలుపు 50శాతంగా ఉంద’న్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు భాజపా గెలుపు శాతం 59 అయితే కాంగ్రెస్‌ది 14శాతమేనని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వాల నిర్వహణ, సుపరిపాలనలో భాజపాకే ప్రజలు అత్యధిక (56%) రేటింగ్‌ ఇచ్చారని ప్రధాని మోదీ విశ్లేషించారని కేంద్ర మంత్రి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని