సంక్షిప్త వార్తలు (5)

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్‌ బిధురి విచారం వ్యక్తం చేశారు.

Updated : 08 Dec 2023 06:34 IST

బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీపై అనుచిత వ్యాఖ్యలకు విచారం తెలిపిన భాజపా ఎంపీ

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్‌ బిధురి విచారం వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరైన రమేశ్‌ బిధురి తన తప్పును అంగీకరించడంతో ఇక ఈ వివాదం ముగిసిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను స్పీకర్‌కు లోక్‌సభ హక్కుల కమిటీ సమర్పించనుంది. మరోవైపు దానీశ్‌ అలీ కూడా కమిటీ ముందు హాజరై వివాదానికి సంబంధించిన వివరాలు అందించినట్లు తెలిసింది. ప్రధాని మోదీని తాను అవమానించానన్న భాజపా ఎంపీల ఆరోపణలను ఆలీ తోసిపుచ్చారు.


‘ఇండియా’ కూటమి సమావేశంలో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండా!

దిల్లీ: ఈ నెల మూడో వారంలో జరగనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో సీట్ల పంపక ఒప్పందాలపై కసరత్తు ప్రధాన ఎజెండా కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 17 - 20 తేదీల మధ్య జరగనున్న ఈ భేటీకి ఇంకా కచ్చితమైన తేదీ ఖరారు చేయలేదని చెప్పాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై సత్వరం నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు తగినంత సమయం ఉంటుందని ఆయా పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సభాపక్ష నేతల సమావేశం బుధవారం జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంటు శీతాకాల సమావేశాలకుగాను ఉభయ సభల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో నేతలంతా ప్రధానంగా దృష్టి పెట్టారు. అంతకుముందు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో సీట్ల పంపకం విషయాన్ని టీఎంసీ నేతలు లేవనెత్తారు.


అవి చాయ్‌ సమోసా భేటీలే

జేడీయూ ఎంపీ వ్యాఖ్య

పట్నా: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీని ప్రశంసించిన జేడీయూ ఎంపీ సునీల్‌కుమార్‌ పింటు తాజాగా ఇండియా కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమిలోని పార్టీల మధ్య విభేదాలను ఎత్తిచూపుతూ నాయకుల ఐక్యతను ప్రశ్నించారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం వాయిదాపడటంపై సునీల్‌కుమార్‌ స్పందిస్తూ..‘‘పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అవగాహన రానంతవరకు అవి చాయ్‌ సమోసా భేటీలే’’ అని వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూతో కొనసాగలేనని ఇప్పటికే ప్రకటించిన సునీల్‌కుమార్‌.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కోరితే వెంటనే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


మోదీ విజయాల అంకగణితంతో విపక్షాల లెక్కలు తారుమారు: నఖ్వీ

గాజియాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాల అంకగణితం ఇండియా కూటమి నేతల లెక్కలను తారుమారు చేస్తోందని భాజపా సీనియర్‌ నేత ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ జిల్లా కోయ్లా గ్రామంలో గురువారం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాదరణతో పర్వత సమానంగా ఎదిగిన నేతను తమ ప్రత్యామ్నాయ గుంపు జయించలేదన్న వాస్తవాన్ని విపక్షాలు గుర్తించాలన్నారు. భాజపా ఘనవిజయం వారసత్వ రాజకీయాల నేతలను ఒత్తిడికి గురిచేసి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తన ప్రేమ దుకాణంలో మోసపూరిత సామాను విక్రయిస్తోందని చెప్పడానికి చరిత్ర నిదర్శనమని నఖ్వీ ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి తమను దోపిడీకి గురిచేస్తున్న ఓట్ల వ్యాపారుల కబంద హస్తాల నుంచి మైనారిటీలు బయటపడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


బోగస్‌ ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏదీ!

లంకా దినకర్‌ విమర్శ

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వానికి బోగస్‌ ఓట్లను జాబితాల్లో చేర్చడంపై ఉన్న శ్రద్ధ.. తుపాన్‌ బాధిత రైతులను ఆదుకోవడంపై మాత్రం లేదని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు. ‘రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు 90 లక్షల ఎకరాలకుపైగా సాగుచేయగా కేవలం 16 మంది రైతులు 0.4 హెక్టార్లలో మాత్రమే సాగుచేసినట్లు బీమా పోర్టల్‌లో నమోదుచేశారు. పంట నష్టం అంచనాల్లో పదేళ్ల కిందట ఉన్న సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, రైతులకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని తేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. అర్హులైన రైతులకు ఫసల్‌ బీమా ప్రయోజనం లేకుండా, నష్ట పరిహారం అంచనా వేయకుండా వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది’ అని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని