పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థలో సమస్యలు

మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

Published : 08 Dec 2023 04:58 IST

లోక్‌సభలో ప్రస్తావించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని లోక్‌సభలో గురువారం ఆయన ప్రస్తావించారు. ఎన్‌ఈపీ మార్గదర్శకాలను అనుసరించి 5,919 పాఠశాలలను విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. అసంబద్ధంగా పాఠశాలలను విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 11 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో ప్రవేశాలకు దూరమవుతారని, ఇందులో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు బాలికలు ఉంటారని తెలిపారు. ఎన్‌ఈపీ మార్గదర్శకాలను అనువుగా మలుచుకొని పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాఠశాలల విలీనంలోని పొరపాట్లను ఏపీ హైకోర్టు ప్రాథమికంగా గుర్తించిందని, విద్యా హక్కును ఉల్లంఘించేలా ఏపీ ప్రభుత్వం జీవో 117 ఉన్నట్లు పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల విలీనంతో తలెత్తే ఇబ్బందులను అధిగమించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని