నెహ్రూను అవమానిస్తే పటేల్‌ను దూషించినట్టే

‘‘భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు.

Updated : 08 Dec 2023 06:21 IST

భాజపా విమర్శలపై కాంగ్రెస్‌ ఎదురుదాడి

దిల్లీ: ‘‘భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. నెహ్రూపై హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు వీరిద్దరినీ అవమానించినట్టే. అలా అవమానించే హక్కు ఎవరికీ లేదు’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు (గుజరాత్‌) శక్తిసింగ్‌ గోహిల్‌ అన్నారు. జమ్మూకశ్మీర్‌ బిల్లులపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో అమిత్‌ షా మాట్లాడుతూ నెహ్రూ ‘రెండు పెద్ద తప్పిదాలు’ చేసినట్టుగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష నేతలు తప్పుపట్టారు. ‘‘అమిత్‌ షా ఉద్దేశపూర్వకంగానే నెహ్రూ పాత్రపై తప్పుడు ప్రకటనలు చేశారు.

ఇది ఇండియా కూటమిని నీరుగార్చే వ్యూహం. హోం మంత్రి కార్యాలయం ఆయనకు చంద్రశేఖర్‌ దాస్‌గుప్తా రాసిన ‘వార్‌ అండ్‌ డిప్లొమసీ ఇన్‌ కశ్మీర్‌’ పుస్తకం చదివేందుకు ఇవ్వాలి’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు. అమిత్‌ షా ప్రకటన పూర్తిగా తప్పని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ఖండించారు. భారత తొలి ప్రధానిని ఉద్దేశించి కేంద్ర మంత్రి వాడిన భాష దురదృష్టకరమని ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌ అన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. నెహ్రూ సేవలను భాజపా నేతలు ఎన్నడూ గుర్తించలేదు’’ అన్నారు. కాగా, భాజపా ఎంపీలు గిరిరాజ్‌సింగ్‌, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ హోం మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘‘ప్రస్తుత కాలానికి చరిత్ర చెప్పాలి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని