మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

Updated : 08 Dec 2023 06:28 IST

బెంగాల్‌లో వెల్లువెత్తిన ఆందోళనలు
గిరిరాజ్‌ క్షమాపణకు డిమాండ్‌
పార్లమెంటు వద్ద మహిళా ఎంపీల నిరసన

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో పశ్చిమబెంగాల్‌ అంతటా టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలతో హోరెత్తించారు. ఆయన మహిళా ద్వేషి అని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గిరిరాజ్‌ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ నినదించారు. స్త్రీ ద్వేషపూరితమైన సింగ్‌ వ్యాఖ్యలపై పార్లమెంటు వద్ద కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గత మంగళవారం జరిగిన 29వ కోల్‌కతా అంతర్జాతీయ సినీ వేడుక(కేఐఎఫ్‌ఎఫ్‌)ల్లో మమతా బెనర్జీ.. బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా, మహేశ్‌ భట్‌, అనిల్‌ కపూర్‌లతో కలిసి కేఐఎఫ్‌ఎఫ్‌ భావ గీతానికి నృత్యం చేశారు.

ఈ నేపథ్యంలో మమతను ఉద్దేశించి.. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్న పరిస్థితులను అన్వయిస్తూ..‘‘ఆమె వేడుకలు జరుపుకొంటూ నృత్యాలు చేస్తూ ఆనందిస్తున్నారు. ఇది సరైన పద్ధతికాదు’’ అంటూ గిరిరాజ్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పును టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘ఇది సిగ్గుచేటు, భాజపా మంత్రులతో ఇదే సమస్య.. అది వాడే భాషేనా’ అని ఆమె మండిపడ్డారు. ఓ మహిళా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సంతను సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బెంగాల్‌ అసెంబ్లీలో గందరగోళం

పశ్చిమబెంగాల్‌ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భాజపా దీనికి క్షమాపణ చెప్పాలన్నారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్‌ తీవ్ర అవినీతిని ఎదుర్కొంటోందని, వాస్తవాలపై దృష్టి పెట్టటం లేదని సువేందు అధికారి (భాజపా)  మాట్లాడారు. దీంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదనలు చెలరేగి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని