తిరుపతికి ‘బ్యాండ్‌’ వేశారు!

తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు.

Updated : 09 Dec 2023 07:05 IST

టెంపుల్‌ సిటీలో రూ. 4,000 కోట్ల టీడీఆర్‌ కుంభకోణం
తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

ఈనాడు, అమరావతి: తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు. ఈసీలను బయట పెట్టాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరు తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిరుపతి మాస్టర్‌ప్లాన్‌ కమిటీలోని సభ్యుల్లో ఇద్దరి పేర్లతోనూ బాండ్లు జారీ చేశారని బయటపెట్టారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే, కమర్షియల్‌గా చూపించి పరిహారం విలువను భారీగా పెంచి బాండ్లను కేటాయించారని పేర్కొన్నారు. ‘ఒక్క తిరుపతిలోనే టీడీఆర్‌ బాండ్ల రూపంలో రూ.4,000 కోట్ల కుంభకోణం జరిగింది.. ఇందులో కరుణాకరరెడ్డి రూ.2,000 కోట్ల మేర సంపాదించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ టీడీఆర్‌ బాండ్లపై రూ.50 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగింది’ అని ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి జగన్‌ నుంచి కార్పొరేషన్లలో సర్వేయర్‌ వరకు చాలామంది పాత్ర ఉంది. ఒక్క వైఎస్‌ కుటుంబమే ఈ బాండ్లపై రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు సంపాదించుకుంది’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తెలిపిన వివరాలివి..

తిరుపతిలో గోల్‌మాల్‌ ఇలా..

‘తిరుపతిలో 18 మాస్టర్‌ప్లాన్‌ రోడ్లను (కొన్ని కొత్తవి, కొన్ని విస్తరించినవి) ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి మంజూరుచేశారు. వాటి కోసం సేకరించిన భూములు, ఆస్తుల పేరిట  గత రెండేళ్లలో 342 బాండ్లను జారీచేశారు. వాటి వివరాలు భూమన తొక్కిపెట్టారు. అయినా సేకరించగలిగాం. తిరుపతిలో మొత్తం 2,85,406.56 చదరపు గజాలకు బాండ్లు ఇచ్చారు. గజానికి సగటున రూ.35 వేల చొప్పున వేసుకున్నా పరిహారం మొత్తం రూ.1,000 కోట్లవుతుంది. కానీ, ఈ స్థలాలన్నింటినీ కమర్షియల్‌గా చూపించి నాలుగు రెట్లు అధికంగా రూ.4,052 కోట్ల బాండ్లు జారీ చేశారు.

కరుణాకరరెడ్డి వేసిన కమిటీలోని వారికీ..

కరుణాకరరెడ్డి వేసిన మాస్టర్‌ ప్లాన్‌ కమిటీలోని సభ్యుల్లో మురళి, పి.అమర్నాథ్‌రెడ్డికి కూడా బాండ్లు ఇచ్చారు. వారు ఇతరుల భూమికి జీపీఏ తీసుకుని దాని ఆధారంగా బాండ్లు తీసుకున్నారు. వీరిద్దరూ ఒకేరోజు జీపీఏ చేయించుకున్నట్లు ఉంది. మురళికి 00062, తర్వాత నంబరు 00063 బాండ్‌ను అమర్నాథ్‌రెడ్డికి జారీ చేశారు. మురళి స్థలం ప్రభుత్వ ధర చదరపు గజం రూ. 10 వేలు.. కానీ, 16 నెలల్లోనే దాని ధర రూ.1.60 లక్షకు పెంచి ఆయనకు రూ.12.69 కోట్ల బాండ్‌ ఇచ్చారు. అమర్నాథ్‌రెడ్డికి రూ.14.72 కోట్ల బాండ్‌ ఇచ్చారు.

కంచి రాము బాండ్‌ నంబరు 00356

‘3,113 చదరపు గజాలకు రూ.61 కోట్ల బాండ్‌ ఇచ్చారు. అందులో చూపించిన స్థలం నివాసిత ప్రాంతం. అయినా కమర్షియల్‌గా రేటు కట్టి ఇచ్చారు.

కె.వెంకటరమణారెడ్డి బాండ్‌ నంబరు 00320

‘4,793 చదరపు గజాలు సేకరించారు. ఈ స్థలం ఉన్న ప్రాంతం వివాదాస్పదమైంది. మఠం భూములు, అధికార వైకాపా పెద్ద నేతల భూములు అక్కడున్నాయి. అయినా వెంకటరమణారెడ్డి స్థలాన్ని కమర్షియల్‌గా చూపించి రూ. 53.72 కోట్ల బాండ్‌ ఇచ్చారు. కమర్షియల్‌ కింద మార్పు (కన్వర్షన్‌) చేసినట్లు ధ్రువీకరణ పత్రం కూడా లేదు.

  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడి కూతురు పెద్దిరెడ్డి ఆశ్రిత భూమిని కమర్షియల్‌గా చూపించి 60 సెంట్లకు రూ.32.52 కోట్ల బాండ్‌ పొందారు.
  • పులిగోరు మహేశ్వరరెడ్డికి 3,415 చదరపు గజాలకు రూ.55.55 కోట్ల బాండ్‌ ఇచ్చారు.
  • అన్నపూర్ణ (ఈమె పెద్దిరెడ్డి బినామీ అంటున్నారు)కు రూ.27 కోట్ల బాండ్‌ జారీచేశారు.

భూమనకు దమ్ముందా..

రూ.లక్ష విలువైన టీడీఆర్‌ బాండ్‌ ఉంటే 40 నుంచి 45 శాతం ఎక్కువ ధరతో బిల్డర్లు కొంటున్నారు. వాటిని ఎమ్మెల్యేల బ్రోకర్లే అమ్మాలి తప్ప, అవి ఉన్నవారు అమ్ముకోలేరు. తిరుపతిలో ఇలా బ్రోకర్ల ద్వారా అమ్మిన బాండ్లపై భూమన కరుణాకరరెడ్డి దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించుకున్నారు. అదేంలేదని మీరు, మీ కుమారుడు తిరుమల శ్రీవారి ముందు ప్రమాణం చేయగలరా కరుణాకర్‌రెడ్డి?’ అని ఆనం సవాల్‌ చేశారు.

పాత బాండ్లపై విచారణ ఏదీ?

రూ. 40,000 నుంచి రూ. 50,000 కోట్ల టీడీఆర్‌ బాండ్లు ఇష్యూ అయిపోయాక.. ఈ ఏడాది అక్టోబరు 30న బాండ్ల జారీ పర్యవేక్షణకు కమిటీ వేయాలంటూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మరి పాతవాటి సంగతి ఏం చేస్తారు? వాటిపై విచారణ జరపరా? తెదేపా అధికారంలోకి రాగానే ఈ బాండ్ల వ్యవహారంపై విచారణ చేయిస్తుంది. సీబీఐ విచారణ కోరతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆ డబ్బును ప్రభుత్వానికి తిరిగి కట్టిస్తాం’ అని ఆనం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని