మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. ‘జై భారత్ నేషనల్ పార్టీ’

విజయవాడ(పటమట), న్యూస్‌టుడే: చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేది తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం రాత్రి విజయవాడలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. జాతీయ జెండా రంగులు, తన ఫొటోతో కూడిన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమన్న అంబేడ్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మానవ హక్కుల రక్షణ, శాంతి భద్రతలు అదుపులో ఉంటే తాను పార్టీ ప్రకటించేవాడినే కాదన్నారు. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని, ప్రజాకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఎవరితో పొత్తు లేకుండా 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని తెలిపారు. పార్టీ పేరుతో వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








