‘కృష్ణా’పై కేసీఆర్‌ వైఖరిని ఎండగడదాం

కృష్ణా నదీ జలాల పంపిణీ, బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారాల్లో భారాస ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ అనుసరించిన వైఖరిని శాసనసభ, మండలిలో కాంగ్రెస్‌ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం.

Updated : 12 Feb 2024 07:08 IST

భారాస ఆరోపణలను ఉభయసభల్లో తిప్పికొట్టాలి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం, మంత్రుల దిశానిర్దేశం
నదీ జలాల అంశంపై ప్రజాభవన్‌లో అవగాహన కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల పంపిణీ, బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారాల్లో భారాస ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ అనుసరించిన వైఖరిని శాసనసభ, మండలిలో కాంగ్రెస్‌ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై వారికి ఆదివారం ప్రజాభవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు తదితరులు హాజరై మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిందంటూ భారాస నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని వివరించినట్లు తెలుస్తోంది. భారాస ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తోందని, దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. భారాస ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారని సీఎం తెలిపినట్లు సమాచారం. తొలుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశాలను పవర్‌ పాయింట్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. నది పుట్టిన స్థలం నుంచి.. ఏయే ప్రాజెక్టులున్నాయి, ఎక్కడ ఎంత నీరు ఏ రాష్ట్రం వినియోగిస్తోందనే వివరాలు తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు.

ప్రాజెక్టులను అప్పగించినట్లు కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్‌లో ఉందంటూ భారాస నేతలు అబద్ధాలు చెబుతున్నారని.. కానీ నీటిపారుదలశాఖ కార్యదర్శి గానీ, ఈఎన్‌సీ గానీ వాటిపై సంతకాలే చేయలేదని ఉత్తమ్‌ తెలిపారు. కేసీఆర్‌.. ఏపీ సీఎం జగన్‌తో కలసిపోయి రాయలసీమకు ఎక్కువ నీటిని తీసుకోవడానికి సహకరించారని మంత్రి ఆరోపించారు. రాయలసీమకు నీటిని తీసుకోవడానికి కేసీఆర్‌ పెద్దమనసుతో అంగీకరించారంటూ ఏపీ సీఎం జగన్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెబుతున్న వీడియో సాక్ష్యం కూడా ఉందని మంత్రి చెప్పినట్లు సమాచారం. కృష్ణా నది పరీవాహక ప్రాంత జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని శాసనసభలో గట్టిగా చెప్పాలని ఉత్తమ్‌ సూచించారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ   విప్‌ బీర్ల అయిలయ్య విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామన్నారు. అసెంబ్లీలో తమ సభ్యులు అడిగే ప్రశ్నలకు భారాస సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం నల్గొండలో కేసీఆర్‌ సభ ఏర్పాటు చేసేలోపే అసెంబ్లీ వేదికగా ప్రజలకు నిజాలు చెబుతామని స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుందామని కేసీఆర్‌ అనుకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని