వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవు

రాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ధ్వజమెత్తారు.

Published : 22 Feb 2024 04:56 IST

జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే ఏళ్లు సరిపోవు
చిత్తూరు జిల్లాలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి

కుప్పం, పుంగనూరు, పెద్దపంజాణి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ధ్వజమెత్తారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఆమె బుధవారం రెండోరోజు పర్యటించారు. శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అనే అంశంపై మహిళలతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పెద్దపంజాణి మండలం శివాడిలో మరణించిన కనకరాజు, కత్తార్లపల్లిలో శంకరప్ప, పుంగనూరు పట్టణం ఎన్‌ఎస్‌పేటకు చెందిన జయమ్మ, మంగళం గ్రామానికి చెందిన పద్మావతి, ఒంట్టిమిట్టకు చెందిన శ్రీనివాసు కుటుంబీకులను పరామర్శించి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. జగన్‌ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడాలంటే సంవత్సరాలు సరిపోవని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చేశారని దుయ్యబట్టారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్నట్లు చెబుతున్న దిశ చట్టం కాగితాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో 2019-21 మధ్య 30,196 మంది మహిళలు అదృశ్యమైనట్లు రాజ్యసభలో చర్చకు వచ్చిందంటే వైకాపా ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు పాలన ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తెదేపా పాలనలో మహిళలు ధైర్యంగా తిరిగేవారని గుర్తు చేశారు.

యువత కోసం నిలబడినందుకే అరెస్టు

ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దీపం పథకం, పసుపు- కుంకుమ, అమృత హస్తం, సామూహిక సీమంతాలు, పెళ్లి కానుక తదితర పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. తెదేపా పాలనలో యువత ఉపాధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చి అనంతపురంలో వేలమందికి ఉపాధి కల్పించారని వివరించారు. వైకాపా పాలనలో అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితులు తట్టుకోలేక అమర రాజ సంస్థ విస్తరణ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలువురు మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసి జైలులో ఉంచినప్పుడు ధైర్యంగా ఎలా ఉన్నారని స్వాతి అనే మహిళ ప్రశ్నించగా.. ఆయన ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి కాదని, రాష్ట్ర భవిష్యత్తు, యువత కోసం నిలబడినందుకు వైకాపా ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదనే విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. తాను ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చానంటే అది తన తండ్రి ఎన్టీఆర్‌, భర్త చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తేనన్నారు.

మహాశక్తి పథకాలు మహిళలకు వరం

చంద్రబాబు ప్రకటించిన మహాశక్తి పథకాలు మహిళలకు వరం లాంటివని భువనేశ్వరి తెలిపారు. తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం, ఉచిత వంట గ్యాస్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాలు సామాన్య, పేద కుటుంబాలకు ఆదరువుగా ఉంటాయని పేర్కొన్నారు.


కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా.. చంద్రబాబుకా?
మహిళలను కాసేపు సరదా చిట్‌చాట్‌  

శాంతిపురంలో మహిళలతో సమావేశం సందర్భంగా కొంతసేపు నారా భువనేశ్వరి నవ్వులు పూయించారు. ‘చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా 35 ఏళ్లుగా ఆదరిస్తున్నారు. ఈ దఫా నన్ను గెలిపిస్తారా?’ అని ఆమె సరదా అన్నారు. ‘చంద్రబాబు కావాలనేవారు చేతులెత్తండి’ అనగా అందరూ చేతులెత్తారు. ‘నేను కావాలనుకునేవారు చేతులెత్తండి’ అంటే అందరూ మరోసారి చేతులు పైకి లేపారు. భువనేశ్వరి నవ్వుతూ తాను సరదాగా ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్‌ చర్చలే కాదు.. అప్పుడప్పుడూ ఇలా సరదాగా మాట్లాడుకోవాలని అన్నారు. ‘మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు.. హెరిటేజ్‌ సంస్థ నిర్వహణలో సంతోషంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని