జగన్‌ రెచ్చగొడుతున్నందునే మీడియాపై వరుస దాడులు

బహిరంగ సభల్లో ‘చొక్కా చేతులు మడతపెట్టండి’ అంటూ హింసను ప్రేరేపించేలా సీఎం జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే వైకాపా రౌడీ మూకలు రెచ్చిపోయి పాత్రికేయులు, పత్రికా కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 22 Feb 2024 04:56 IST

అవినీతిని ప్రశ్నిస్తున్న పత్రికల్ని లక్ష్యంగా చేసుకొన్నారు
మీడియా యాజమాన్యాల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారు
సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బహిరంగ సభల్లో ‘చొక్కా చేతులు మడతపెట్టండి’ అంటూ హింసను ప్రేరేపించేలా సీఎం జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే వైకాపా రౌడీ మూకలు రెచ్చిపోయి పాత్రికేయులు, పత్రికా కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియాపై దాడులు పెరిగాయని, ఇవన్నీ ప్రభుత్వ ప్రేరేపితాలేనని విరుచుకుపడ్డారు. దాడుల్ని అడ్డుకోవడం, నిందితుల్ని పట్టుకొని కఠిన శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ విధానాలతో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  తన అవినీతిని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లను లక్ష్యంగా చేసుకొని జగన్‌ పదేపదే బురదజల్లుతున్నారని మండిపడ్డారు. పోలీసుల్ని ప్రయోగించి ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని, వారిని తన దారికి తెచ్చుకోవాలనే ఇలా చేస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో విలేకర్లు, మీడియా సంస్థలపై జరిగిన దాడుల్ని ప్రస్తావిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. దాడులకు బాధ్యుడైన జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం అయినప్పటి నుంచీ ఇదే ధోరణి

‘జగన్‌ సీఎం అయినప్పటి నుంచీ పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు ప్రారంభమయ్యాయి. 2019 అక్టోబర్‌లో జీఓ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కాలని చూశారు. వైకాపా ఇసుక మాఫియాను వెలుగులోకి తెచ్చారనే కోపంతో అమరావతి మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి పరమేశ్వరరావుపై ఈ నెల 14న హత్యాయత్నం చేశారు. 18న రాప్తాడు ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ కార్యాలయంపై ఆయన అనుచరులు మంగళవారం దాడి చేసి, గంటసేపు భీతావహ వాతావరణం సృష్టించారు. అదే రోజు కర్నూలు జిల్లా మద్దికెరలో వైకాపా సభను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్‌పై దాడి జరిగింది’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. ఈ దాడి ఘటనలపై వేగంగా దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరారు. ఈ లేఖ ప్రతులను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని