ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే మూసీలో పడినట్లే!

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్లేస్తే మూసీనదిలో పడినట్లేనని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట, ధన్వాడ, మరికల్‌ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు.

Published : 22 Feb 2024 04:18 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నారాయణపేట, ధన్వాడ, న్యూస్‌టుడే: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్లేస్తే మూసీనదిలో పడినట్లేనని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట, ధన్వాడ, మరికల్‌ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. భారాస దోపిడీదారుల పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. పైరెండు పార్టీలకు వేసే ఓట్లు మురిగిపోతాయన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కై దుష్ప్రచారం చేసినా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌లు అదే ప్రచారం కొనసాగిస్తాయని... వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.  రాష్ట్రంలో అన్ని రంగాలకు కేంద్రం వేలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించిందన్నారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినా కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఎలాంటి ఎజెండా లేదని... ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా కలిగే నష్టం ఏమీలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత అప్పుడే మొదలైందని, ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోతోందన్నారు. దేశం కోసం ఓటు వేస్తున్నామన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ పాలమూరులో భాజపా గెలిస్తే మరికల్‌ నుంచి కర్ణాటకలోని రామసముద్రం వరకు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌, నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, శ్రీనివాస్‌, నర్సన్‌గౌడ్‌, రాంచంద్రయ్య, ఉదయభాను, మాకం సురేందర్‌, గోవర్ధన్‌గౌడ్‌, ఉమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చేనేత మగ్గాలు పరిశీలించిన భాజపా నాయకులు...

నారాయణపేటలోని గాంధీనగర్‌లో చేనేత కార్మికులతో కిషన్‌రెడ్డి, డీకే అరుణ మాట్లాడారు. మగ్గాల పనితీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులకోసం ఈ ప్రాంతానికి టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. 

భారాస అడుగుజాడల్లోనే కాంగ్రెస్‌: ఎన్‌వీఎస్‌ఎస్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ప్రభుత్వ అడుగు జాడల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే సలహాదారులు, రాజకీయ నియామకాలు అవసరమా? అని ప్రశ్నించారు. భాజపా విజయ సంకల్ప యాత్రలకు అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని