పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌

లోక్‌సభ ఎన్నికలకు తొలి అభ్యర్థిని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరును సీఎం బుధవారం అధికారికంగా వెల్లడించారు.

Published : 22 Feb 2024 04:19 IST

ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
మిగిలిన 16 స్థానాలకూ ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు తొలి అభ్యర్థిని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరును సీఎం బుధవారం అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 305 మంది దరఖాస్తులిచ్చారు. వీరే కాకుండా ఇతర పార్టీల నుంచి చేరిన పలువురు టికెట్లు అడుగుతున్నారు. పార్టీ కచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఇప్పటికే అభ్యర్థుల పేర్ల జాబితాను పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీకి అప్పగించింది. దాన్ని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తోంది. అధిష్ఠానం ఆమోదం లభించినందునే వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వంశీచంద్‌రెడ్డి 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా నెగ్గారు. లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ అత్యున్నత విధాయక మండలి అయిన వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌ టికెట్‌ కోసం పలువురు పోటీపడినా వంశీచంద్‌రెడ్డికే దక్కడం గమనార్హం.

విజయావకాశాలు ఉన్నవారికే..!

మహబూబ్‌నగర్‌ మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. వీటిలో హైదరాబాద్‌ మినహా మిగిలిన స్థానాల కోసం పలువురు నేతలు పైరవీలు చేస్తున్నారు. పలువురు అధికారులు, విశ్రాంత ఉద్యోగులు, పారిశ్రామిక రంగాలకు చెందినవారు టికెట్‌ కోసం సీనియర్‌ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఆశావహుల్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయనే కోణంలో పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయిస్తోంది. కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని అధిష్ఠానం ఇప్పటికే రాష్ట్ర పార్టీకి సూచనలిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల్లో బలమున్న నేతలు టికెట్లు అడుగుతున్నా వారి పేర్లనూ పరిశీలిస్తున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు బీసీ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్‌ టికెట్‌ ఆశించిన సురేష్‌ షెట్కార్‌కు పార్టీ తొలుత బీ-ఫాం కూడా ఇచ్చింది. మరో నేత సంజీవరెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టడంతో నామినేషన్ల దాఖలుకు ముందు షెట్కార్‌ నుంచి బీ-ఫాం వెనక్కి తీసుకుంది. ఆ సమయంలో జహీరాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇస్తామని ఆయనకు పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వరంగల్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ టికెట్లు ఆశించిన నలుగురు నేతలకు ఇటీవల ఇతర పదవులు ఇచ్చినందువల్ల మిగిలినవారి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. త్వరలో అభ్యర్థులందర్నీ ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పీసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, బీసీలకు నాలుగు టికెట్లు ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన నేతలు కోరుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని