లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

‘త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్లను చైతన్యవంతులను చేయటంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు.

Published : 22 Feb 2024 04:20 IST

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్లను చైతన్యవంతులను చేయటంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇక్కడి ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ ‘ఎన్నికల నియమావళిని అమలు చేయటంలో రాజకీయ పార్టీలు సహకరించాలి. నామినేషన్ల ప్రక్రియలో గతంలో ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లు, ఇటీవల కాలంలో మరణించిన వారి వివరాలను ఓటర్ల జాబితాను నుంచి తొలగించి తుది ఓటర్ల జాబితాను ఇటీవల ప్రకటించాం. ఓటర్ల నమోదు నిరంతరాయంగా సాగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల విషయంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇబ్బందులు వచ్చాయి. ఈ దఫా ఆ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని వికాస్‌రాజ్‌ వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు అంశాలకు అధికారులు సమాధానాలు చెప్పారు. సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నుంచి నిరంజన్‌(కాంగ్రెస్‌), శ్రీనివాస్‌రెడ్డి(భారాస), మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోని రెడ్డి(భాజపా), కౌసర్‌ మొహియుద్దీన్‌(మజ్లిస్‌), నంద్యాల నర్సింహారెడ్డి(సీపీఎం) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని