మా బ్యాంకు ఖాతాల నుంచి అక్రమంగా రూ.65 కోట్లు తీసుకున్నారు

పన్ను చెల్లింపు వివాదం న్యాయస్థానం పరిశీలనలో ఉండగానే తమ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ అప్రజాస్వామికంగా రూ.65 కోట్లను తీసేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 22 Feb 2024 04:21 IST

ఆదాయపు పన్ను శాఖపై కాంగ్రెస్‌ ఆరోపణ

దిల్లీ: పన్ను చెల్లింపు వివాదం న్యాయస్థానం పరిశీలనలో ఉండగానే తమ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ అప్రజాస్వామికంగా రూ.65 కోట్లను తీసేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.5కోట్లు, కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.60.25 కోట్ల బదిలీకి ఆయా బ్యాంకులను మంగళవారం ఐటీ శాఖ ఆదేశించిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్‌ మాకన్‌ బుధవారం వెల్లడించారు. తమకు ఐటీ శాఖ పంపిన రూ.210 కోట్ల డిమాండ్‌ నోటీస్‌పై ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగిందని, గురువారం కూడా ఇది కొనసాగనుందని తెలిపారు. ట్రైబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నందున పార్టీ ఖాతాల నుంచి డబ్బును తీసుకోవద్దని బ్యాంకులకు లేఖ రాశామన్నారు. అయినప్పటికీ ఐటీ శాఖ పేరుతో డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయించారని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ పన్ను చెల్లించిందా?అని మాకన్‌ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌ పార్టీని పన్ను అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారని ఆరోపించారు. సభ్యత్వం ద్వారా, క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా, క్షేత్రస్థాయిలో చందాల ద్వారా యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐలు నిధులు సేకరించుకున్నాయని అజయ్‌ మాకన్‌ చెప్పారు. ఏయే బ్యాంకుల నుంచి ఐటీ శాఖ కాంగ్రెస్‌ పార్టీ డబ్బును తీసుకుందో వివరిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం అంతమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రూ.210 కోట్ల డిమాండ్‌ నోటీస్‌కు సంబంధించి గత శుక్రవారం ఐటీ శాఖ తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. రూ.115 కోట్లను ఖాతాల్లో నిల్వ ఉంచాలని, అంతకు మించి ఉన్న నగదును పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చంటూ ట్రైబ్యునల్‌ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు