సంక్షిప్త వార్తలు (5)

ఎన్నికల్లో పొత్తులపై ఈనెల 23న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల సీపీఐ, సీపీఎం నాయకులతో సమావేశమై చర్చిస్తారని అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు తెలిపారు.

Updated : 22 Feb 2024 06:46 IST

ఎన్నికల్లో పొత్తులపై వామపక్షాలతో 23న షర్మిల చర్చలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల్లో పొత్తులపై ఈనెల 23న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల సీపీఐ, సీపీఎం నాయకులతో సమావేశమై చర్చిస్తారని అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రంలో వైకాపాకు, కేంద్రంలో భాజపాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.


బీఎస్పీ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం నేడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం విజయవాడలో నేడు జరగనుంది. కార్యక్రమంలో పూర్వ ఐపీఎస్‌ అధికారి జె.పూర్ణచందర్‌రావు బీఎస్పీలో చేరనున్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు రామ్‌జీ గౌతమ్‌, బీఎస్పీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హాజరుకానున్నారు.


చొక్కాలు మడతపెట్టాలని పిలుపునిచ్చింది ఇందుకేనా?
నాగుల్‌ మీరా ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రశ్నించే గొంతులను చూస్తే సీఎం జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ఎద్దేవా చేశారు. ‘ఈనాడు’ కార్యాలయంపై వైకాపా మూక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘చొక్కాలు మడతపెట్టండి’ అని జగన్‌ వైకాపా శేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడలేని వ్యక్తి సీఎం పదవికి అనర్హుడన్నారు. ఇతర మీడియా సంస్థలంటే గిట్టనప్పుడు తన సభలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో కొడాలి నాని సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.


కథలు చెప్పడం తప్ప పరిశ్రమలు తేవడం చేతకాదు
మంత్రి అమర్‌నాథ్‌పై పిల్లి మాణిక్యరావు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : కోడిగుడ్డు కథలు చెప్పడం తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం మంత్రి అమర్‌నాథ్‌కు తెలియదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌ను విమర్శించే అర్హత ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శంఖారావం బహిరంగ సభల ద్వారా ఉత్తరాంధ్ర వైకాపా ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ, దౌర్జన్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారనే అక్కసుతోనే లోకేశ్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐటీ మంత్రిగా లోకేశ్‌ తెచ్చిన పరిశ్రమలు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలు, పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని