పథకం ప్రకారమే మీడియాపై దాడులు

గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ పాలనలో.. మీడియా, ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 

Published : 22 Feb 2024 04:26 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ పాలనలో.. మీడియా, ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ‘సీఎం జగన్‌ పథకం ప్రకారమే వీటిని చేయిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెడితే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏ ఒక్కరిని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.


జగన్‌ను గద్దె దించడానికి సిద్ధం
రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌

తెదేపా నేతలు రోడ్ల మీదికి వస్తేనే అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు.. వైకాపా శ్రేణులు పత్రిక కార్యాలయాలు, విలేకరులపై దాడులకు పాల్పడుతున్నా కేసులు నమోదు చేయట్లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.


నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ

విలేకరులు, మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వక దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛకు పౌరసమాజం అండగా నిలవాలి.


పత్రికలది ప్రతిపక్ష పాత్ర
సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలకపల్లి రవి

పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించడం సహజం. అంతమాత్రాన ఆ సంస్థ కార్యాలయాలు ధ్వంసం చేయడం, విలేకర్లపై దాడులకు దిగడం సరికాదు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కారకులపై చర్యలు తీసుకోవాలి.


అవినీతి చేయలేదని ప్రమాణానికి సిద్ధమా?
తెదేపా బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి

అవినీతికి పాల్పడలేదని యాగంటి క్షేత్రంలో ప్రమాణం చేయడానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారా? బీసీల భూములు, పార్కులను కూడా వదిలిపెట్టకుండా కాటసాని కబ్జా చేశారు.


వైకాపా నిరంకుశత్వానికి నిదర్శనం:
గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌

పత్రిక కార్యాలయాలు, విలేకర్లపై దాడులు చేయడం వైకాపా ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. కర్నూలులో ‘ఈనాడు’  కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని