వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి గవర్నర్‌ పాలన విధించాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

Published : 22 Feb 2024 04:28 IST

రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించాలి
ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌

ఈనాడు, దిలీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి గవర్నర్‌ పాలన విధించాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో హింస పేట్రేగిపోతున్న తరుణంలో ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి జగన్‌మోహన్‌రెడ్డికి అర్హత లేదని అన్నారు. ప్రభుత్వం ప్రోత్సహించకపోతే అనంతపురం జిల్లా రాప్తాడులో ఫోటో జర్నలిస్టుపై, కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడులు జరగేవి కావని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విచ్చలవిడిగా మాట్లాడుతుండడం వల్లే మీడియాపై దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. నిజాలను రాసే ఈనాడుపై దాడులు చేస్తే, నిత్యం అబద్ధాలను రాసే సాక్షి దినపత్రికను ఏం చేయాలని ఎంపీ ప్రశ్నించారు. కర్నూలు నగర ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడి చేసిన అంశంపై ఆయన బుధవారం రచ్చబండ కార్యక్రమంలో స్పందించారు. ‘ఒక మీడియా సంస్థపై దాడి చేయడం, జర్నలిస్టులను దారుణంగా కొట్టడాన్ని చూస్తే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. ఈ ఘటనలు గవర్నర్‌ దృష్టికి కూడా వెళ్లి ఉంటాయి కాబట్టి తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ అంశంపై గవర్నర్‌కు లేఖలు రాయాలి. ప్రస్తుత సంఘటనలను చూసిన తర్వాత గవర్నర్‌ కనీసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల ఎస్పీలను హెచ్చరిస్తారని భావిస్తున్నా. ముఖ్యమంత్రిని కూడా నిలదీసే అధికారం గవర్నర్‌కు ఉంది. ఆయన ఆ అధికారాన్ని ఉపయోగిస్తారని భావిస్తున్నా’ అని రఘురామ పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ఛార్జిషీట్లకు సంబంధించి రోజుకో నిజాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకొస్తోందన్నారు. ఒక్కొక్క కేసులో ఎన్నిసార్లు వాయిదాలు అడిగారనే వివరాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చినందుకే ఏదో ఒక వంక పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇటువంటి భయానక వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాల్సిందేనని రఘురామ డిమాండ్‌ చేశారు.

ఇండియా టుడే సర్వేలో అడ్రస్‌ లేని జగన్‌

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడ్రసే లేదని, అట్టర్‌ ఫ్లాప్‌ మార్కులు వచ్చాయని రఘురామ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని