జగన్‌ అక్రమాలకు సహకరిస్తున్న కలెక్టర్లు జైలుకెళ్లక తప్పదు

సీఎం జగన్‌ ఇసుక అక్రమాలకు సహకరిస్తున్న కలెక్టర్లు జైలుకు వెళ్లడం ఖాయమని తెదేపా సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు.

Published : 23 Feb 2024 04:41 IST

తెదేపా సీనియర్‌ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సీఎం జగన్‌ ఇసుక అక్రమాలకు సహకరిస్తున్న కలెక్టర్లు జైలుకు వెళ్లడం ఖాయమని తెదేపా సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. న్యాయస్థానాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ జే గ్యాంగ్‌ అయిదేళ్లలో రూ.50 వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. జేపీ వెంచర్స్‌కు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,528 కోట్లు ఆదాయం వచ్చిందని మైనింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణద్వివేది చెప్పేదంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా పేరుతో గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వమే జేపీ సంస్థకు రూ.1,100 కోట్లు చెల్లించిందని తెలిపారు. ‘నాడు-నేడు’ కింద పాఠశాలల మరమ్మతులకు ఇసుక అందించారని రూ.80 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ కింద రూ.50 కోట్లు జేపీ వెంచర్స్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక అక్రమాలకు సీఎం జగన్‌రెడ్డే బాధ్యుడని మండిపడ్డారు. ‘‘గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీ ఎండీగా అర్హతలేని వ్యక్తిని నియమించారు. ఆయన దోపిడీకి సహకరిస్తూ, వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ తెలివిగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని