భాజపాకు అధికారంలో ఉండే హక్కు లేదు

రైతులకు, మైనారిటీలకు అన్యాయం చేస్తున్న భాజపాకు అధికారంలో ఉండే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు.

Published : 23 Feb 2024 04:45 IST

సీపీఎం జన శంఖారావంలో వి. శ్రీనివాసరావు

విజయవాడ (మధురానగర్‌), న్యూస్‌టుడే: రైతులకు, మైనారిటీలకు అన్యాయం చేస్తున్న భాజపాకు అధికారంలో ఉండే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. సీపీఎం ఆధ్వర్యంలో జన శంఖారావం కార్యక్రమం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘దళితులు, మైనారిటీలపై కేంద్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. కనీస మద్దతు ధర ప్రకటించలేదని రైతులు ఉద్యమం ప్రారంభిస్తే దాడులు చేస్తోంది. అభివృద్ధిపై కాకుండా మతతత్వం, అయోధ్య రామాలయం చుట్టూ ప్రజలను ఆ పార్టీ నాయకులు తిప్పుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో అన్ని వర్గాల ప్రజలూ అల్లాడుతున్నారు’ అని విమర్శించారు. భాజపా విధానాలపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన భాజపా, దాని మిత్రపక్షాలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం అభివృద్ధి చేశామో చెప్పుకోలేక వాలంటీర్ల ద్వారా కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు ఉద్యమంలో పాల్గొని హరియాణా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కరణ్‌సింగ్‌కు నాయకులు నివాళులర్పించారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌, డి.వి.కృష్ణ, కె.శ్రీదేవి, సీపీఐ నాయకులు నక్కా వీరభద్రరావు, కె.వి.భాస్కరరావు, కె.రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని