‘గుడ్డు’ మాటలు.. గడ్డు రోజులు! నైరాశ్యంలో మంత్రి అమర్‌నాథ్‌

ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఏమీ ఉద్ధరించలేదు. మరి మంత్రిగా ఏం చేశారు.. కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారు అంటే.. ‘ఇప్పుడేగా కోడి గుడ్డు పెట్టింది.

Updated : 23 Feb 2024 07:01 IST

‘నా తల రాత జగనే రాస్తారు’ అంటూ డాంబికాలు

ఈనాడు, విశాఖపట్నం: ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఏమీ ఉద్ధరించలేదు. మరి మంత్రిగా ఏం చేశారు.. కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారు అంటే.. ‘ఇప్పుడేగా కోడి గుడ్డు పెట్టింది. పొదగాలి’ అంటూ పిట్ట కథలు చెప్పి ‘గుడ్డు మంత్రి’గా ముద్ర వేసుకున్నారంతే! సొంత పార్టీ సర్వేల్లోనూ గెలిచే అవకాశాల్లేవని తేలడంతో అధిష్ఠానం వచ్చే ఎన్నికలకు అమాత్యుని సీటు గాల్లో పెట్టింది. ఇప్పటికే మంత్రి నియోజకవర్గం అనకాపల్లికి వైకాపా ఇన్‌ఛార్జిగా మలసాల భరత్‌ను నియమించింది. దాంతో ఆయన పక్క నియోజకవర్గాల్లోకి తొంగి చూసినా.. అక్కడా సామాజిక సమీకరణలు, సర్వేల్లో వెనుకబాటు ఉండటంతో మొండి చేయే చూపారు. వైకాపా ఏడు విడతలుగా ప్రకటించిన జాబితాలో మంత్రి అమర్‌నాథ్‌కు చోటు దక్కలేదు. దీంతో సీటు రాదని అర్థమై, ప్రెస్‌మీట్‌లలో మీడియా అడిగే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక ‘అధిష్ఠానం ఏ బాధ్యతలిచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ కొత్త రాగం మొదలు పెట్టారు. సభలు, సమావేశాలకు హాజరైనా కక్కలేక మింగలేక నైరాశ్యంలో కనిపిస్తున్నారు.

విశాఖకు ఏ ప్రముఖులు వచ్చినా స్వాగతం పలికే బాధ్యత ఇప్పటి వరకు అమర్‌నాథ్‌ చూసేవారు. తాజాగా విశాఖలో జరుగుతున్న మిలాన్‌కు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం అమర్‌నాథ్‌.. ఇటీవల సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ప్రభావమే అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి విశాఖలో ఏదొక నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తారనుకున్న అమర్‌నాథ్‌కు తాజాగా ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పదవి అప్పగించారు. దాంతో ఇక సీటు వచ్చే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. ఉమ్మడి విశాఖలోని 15 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తనకు డిప్యూటీ ప్రాంతీయ సమన్వయకర్త పదవి ఇచ్చారని, ‘నా తల రాత జగనే రాస్తారు’ అంటూ చెప్పుకొస్తున్నారు. మరో వైపు ఆయన.. ఎమ్మెల్యే సీటు కోసం వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని