28న తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావం

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి.

Published : 23 Feb 2024 05:00 IST

తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ
రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశంలో నిర్ణయం
ఎన్‌డీఏలోకి ఆహ్వానించారు.. చర్చలు జరుగుతున్నాయి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం
జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటన

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి. విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం తెదేపా, జనసేన సమన్వయ కమిటీలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. అనంతరం ఇరు పార్టీల నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌లు విలేకర్లకు ఈ వివరాలను వెల్లడించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు ప్రజలకు వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ‘ఇప్పటికే మాతో పొత్తులో ఉన్న జనసేన ఎన్‌డీఏలో భాగస్వామి. ఆ కూటమిలో చేరాలని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందింది. మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిల్లీ వెళ్లి మాట్లాడారు. చర్చలు జరుగుతున్నాయి. ఇందులో దాపరికమేదీ లేదు. త్వరలోనే అన్నీ ఖరారవుతాయి. ప్రజలకు అన్నీ వెల్లడిస్తాం’ అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు, నేతలు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఆ పార్టీ నాయకులు కందుల దుర్గేష్‌, బి.మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు (చినబాబు), బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్వి గురువారం విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది. ఉమ్మడి మ్యానిఫెస్టోకు తుదిరూపు ఇవ్వడం, ఉమ్మడి బహిరంగసభ నిర్వహణ, రెండు పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రెండు పార్టీల నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం

వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని, ఏపీలో వైకాపాకు బైబై చెప్పాలని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తు నిర్ణయం తీసుకుని కలిసి ప్రయాణిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఉమ్మడి ఎన్నికల శంఖారావంలో రెండు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరాన్ని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నాయి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ల నేతృత్వంలో జరిగే సభకు రెండు పార్టీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులంతా హాజరవుతారు. దాదాపు 6 లక్షల మంది ఈ బహిరంగసభకు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.

మ్యానిఫెస్టోపై కసరత్తు

ఉమ్మడి మ్యానిఫెస్టోపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. దాదాపు ఇది కొలిక్కి వచ్చింది, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం ఇప్పటికే ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పి, వాటిని జనంలోకి తీసుకెళ్తోంది. మరోవైపు ‘జనసేన షణ్ముఖ వ్యూహం’లో భాగంగా ప్రజలకు ఏమేం చేయబోతున్నారో ప్రకటించారు. ఈ రెండింటినీ కలపడంతో పాటు ఇంకా ఏయే అంశాలు చేర్చాలో ఈ సమావేశంలో చర్చించారు. 

ఇంత దుర్మార్గపు సీఎంను చూడలేదు: అచ్చెన్నాయుడు

‘రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. జగన్‌ లాంటి దుర్మార్గ, దారుణ సీఎంను ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో మొదటిసారి 5 కోట్ల మంది ప్రజలు అసహ్యించుకునే ముఖ్యమంత్రిగా ఆయన పేరుపొందారు. ఒక సైకోలా రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకే మరోసారి జగన్‌ ముఖ్యమంత్రి కాకూడదని, ఆయన ప్రజావ్యతిరేక విధానాలు, దళిత, బడుగు బలహీనవర్గాలపై దమనకాండపై తెలుగుదేశం, జనసేన కలిసి పోరాటం చేస్తున్నాయి. జగన్‌  సామదాన భేద దండోపాయాలతో గెలవాలని చూస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలను చీలుస్తున్నారు. తగాదాలు పెడుతున్నారు. జనసేన, తెలుగుదేశం మధ్య తగాదాలు పెట్టి తాను లాభపడాలన్నది జగన్‌ ఆలోచన. కులాలు, మతాలు, వ్యక్తుల మధ్య కూడా ఆయన తగాదాలు పెడతారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు కూడా పన్నుతున్నారు’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలంతావీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమిని గెలిపించి, రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం: మనోహర్‌

వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు లక్ష్యంగా జనసేన తెదేపాతో పొత్తు పెట్టుకుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఎక్కడా లోపం లేకుండా రెండు పార్టీల నాయకులు మంచి భావనతో ముందుకు సాగుతున్నామన్నారు. సీట్లు, ఓట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఉమ్మడిగా, బలంగా కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా కొందరు నాయకులు త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని, కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.


మీడియాపై గూండాగిరీ ప్రజాస్వామ్యానికి హానికరం

కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తాం
తెదేపా- జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానం

ఈనాడు, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ఉన్న మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లో దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామం. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో  మీడియా ప్రతినిధులు, మీడియా కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. పాలకపక్షమే ఈ దాడులు చేస్తుండటం వైకాపా నైజాన్ని వెల్లడిస్తోంది. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను ప్రెస్‌ కౌన్సిల్‌ దృష్టికి, కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తాం’ అని తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీల సమావేశం తీర్మానించింది. కర్నూలులో ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణ,  న్యూస్‌టుడే, ఆంధ్రజ్యోతి విలేకరులు పరమేశ్వరరావు, వీరశేఖర్‌లపై చేసిన మూకదాడులు, తుని నియోజకవర్గంలో సత్యనారాయణ అనే విలేకరి హత్య ఘటనలను సమావేశం తీవ్రంగా ఖండించింది. వైకాపా పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, నేతల అరాచకాలు, పాలకుల వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో పత్రికలు, ఛానళ్లు ప్రజలకు తెలియచెబుతున్నాయంది. ఇది జీర్ణించుకోలేని వైకాపా ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను హరించడంతో పాటు దాడులకు పాల్పడుతోందని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికా సంస్థలు, పాత్రికేయులను కట్టడి చేసేందుకు తొలుత జీఓలు ఇచ్చి కేసులు నమోదు చేయించిందని, ఇప్పుడు  దాడులకు తెగబడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని