షర్మిల అరెస్టు

మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్‌పార్టీ గురువారం చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 23 Feb 2024 05:04 IST

బలవంతంగా లాక్కెళ్లి వాహనం ఎక్కించిన పోలీసులు
వాహనమెక్కుతూ జారిపడగా.. షర్మిలకు స్వల్ప గాయం
కాంగ్రెస్‌ ‘చలో సచివాలయం’ తీవ్ర ఉద్రిక్తం

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-అమరావతి, మంగళగిరి-న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్‌పార్టీ గురువారం చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షురాలు, జగన్‌ సోదరి షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. షర్మిల కూడా అంతే మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లారు. పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్‌ ఎక్కించే క్రమంలో వాహనం మెట్లపై జారి పడటంతో షర్మిల చేతికి స్వల్ప గాయమైంది. ఈ సందర్భంగా ‘సీఎం జగన్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ ఆమె నినాదాలు చేశారు. పోలీసులు దొరికినవారిని దొరికినట్లుగా నాయకులు, కార్యకర్తలను వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. షర్మిలతోపాటు మొత్తం 47 మందిని అరెస్టు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో 2 గంటల ఆలస్యంగా 12 గంటలకు మొదలైంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలను విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ ముందు పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుకి నిరసనగా షర్మిలతోపాటు పలువురు సీనియర్‌ నేతలు ఆంధ్రరత్న భవన్‌ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు బైఠాయించారు. దాదాపు 2 గంటలపాటు ఆమె అక్కడే ఉన్నారు. సీఎం జగన్‌ డౌన్‌ డౌన్‌...దగా డీఎస్సీ వద్దు..మెగా డీఎస్సీ కావాలి’ అంటూ నినాదాలు చేశారు.

రాస్తారోకోలు...నిరసనలు

మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రరత్న భవనం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల కాలినడకన సచివాలయానికి బయలు దేరారు. మార్గమధ్యలో స్వర్ణప్యాలెస్‌ హోటల్‌, పోలీసు కంట్రోల్‌ రూం కూడలిలో రాస్తారోకో చేశారు. రెండు సందర్భాల్లోనూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండలోనూ రోడ్డుపై కార్యకర్తలతో కలిసి ఆమె బైఠాయించారు. అక్కడి నుంచి వారు వాహనాల్లో ప్రకాశం బ్యారేజీ మీదుగా సచివాలయానికి బయలుదేరారు. కొండవీటివాగు ఎత్తిపోతల పథకం వద్ద పెద్దఎత్తున మోహరించిన పోలీసులు మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో కాంగ్రెస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల్లోని కాంగ్రెస్‌ నేతలను లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. కొందరు సీనియర్‌ నేతలను కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తోపులాట జరిగింది.

షర్మిలను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

మహిళా పోలీసులు షర్మిలను వాహనం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగానే ఆమె వాహనం మెట్లపై జారిపడ్డారు. పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు.

సీపీఎం, సీపీఐ సంఘీభావం

చలో సచివాలయం కార్యక్రమానికి సీపీఎం, సీపీఐలు సంఘీభావం ప్రకటించాయి. ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సమయంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతు ప్రకటించారు.

షర్మిల అరెస్టు తగదు: మాణికం ఠాగూర్‌

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అరెస్టును రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఖండించారు. పోలీసులు అరెస్టు చేసిన విధానాన్ని చూస్తుంటే జగన్‌కు షర్మిలపై ఉన్న కోపం అర్థమవుతోందని గురువారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని