ఏటా జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. ‘సాక్షి’ క్యాలెండర్‌ ఇస్తున్నారు

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈ అయిదేళ్లలో వేల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడిన పాపం మీది కాదా అని ముఖ్యమంత్రి జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

Updated : 23 Feb 2024 06:22 IST

మెగా డీఎస్సీ పేరుతో జగన్‌ దగా
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేకనే నిరుద్యోగుల బలవన్మరణాలు
ఈ పాపం జగన్‌ ప్రభుత్వానిదే
డీఎస్సీలో మీకంటే చంద్రబాబే నయం
ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈ అయిదేళ్లలో వేల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడిన పాపం మీది కాదా అని ముఖ్యమంత్రి జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఇవి నిజంగా ఆత్మహత్యలా? ప్రభుత్వం చేస్తున్న హత్యలా అని ఆమె మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు  చేసిన వారిలో ఏటా 500 మంది చనిపోతున్నారంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. ఇది మనం చేతులారా చేసుకున్న పాపం కాదా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆత్మహత్యలకు పాల్పడిన విషయం ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఉపాధి కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుంటే యువత లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోదా అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఇవ్వాలని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించారు.

‘ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. సాక్షి క్యాలెండర్‌ తప్ప జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా, మంత్రులుగా అధికారం అనుభవిస్తున్నారు. చదువుకున్న వారికైతే ఉద్యోగాలు లేవు’ అని షర్మిల ఆక్షేపించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి కార్యక్రమం ప్రారంభించే ముందు, పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించాక షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘జాబ్‌ నోటిఫికేషన్ల వరద పారిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగనన్న ఒక్క జాబ్‌ క్యాలెెండర్‌ అయినా ఇచ్చారా? 23 వేల టీచర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇస్తామన్న మెగా డీఎస్సీ ఎక్కడ? గత ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం మీకు లేదా? బాబు పోవాలి..జాబ్‌ రావాలి అనే నినాదం మీది కాదా? అధికారంలోకి వచ్చాక ఈ అయిదేళ్లూ ఏం చేశారు? మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశారు’ అని జగన్‌పై షర్మిల మండిపడ్డారు.

సచివాలయాల్లో ఉద్యోగాలు జగనన్న తన సైన్యానికి ఇచ్చుకున్నవే

‘అయిదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న చెబుతున్నారు. పొరుగు సేవలు, ఒప్పంద కార్మికులు కూడా అందులో ఉన్నారని అంటున్నారు. 1.21 లక్షల ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న తన సైన్యం కోసం ఇచ్చుకున్నవే. ఆర్టీసీని విలీనం చేస్తేనే వచ్చినవి 51 వేల ఉద్యోగాలు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలే ఇప్పటివరకూ భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గుండాలి? వైఎస్‌ఆర్‌ మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. మాట తప్పం మడమ తిప్పమన్నారు..వైఎస్‌ఆర్‌ వారసత్వం అంటే ఇదేనా? నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయి? అయిదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

చంద్రబాబును విమర్శించి నువ్వేం చేశావు?

‘డీఎస్సీలో ఏడు వేల ఉద్యోగాలే ఇచ్చారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టావా? లేదా? మీ ప్రభుత్వంలో ఆరు వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకే డీఎస్సీ ఇచ్చావు. మీకంటే చంద్రబాబే నయం. ఎన్నికలకు ముందు మీరు డీఎస్సీ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా? ఈ అయిదేళ్లూ గుడ్డి గుర్రానికి పళ్లు తోమావా?’ అని జగన్‌ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జర్నలిస్టులను కొడుతున్నారంటే...మీరు భయపడుతున్నారన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. జాబ్‌ క్యాలెండర్‌ను మొదట మీరు వెంటనే ప్రకటించండి. దాని అమలు విషయం వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది’ అని షర్మిల అన్నారు.

తాలిబన్ల పాలనలో ఉన్నామా? ఏమిటీ అరాచకం?

‘చలో సచివాలయం అంటే మాపై ఆంక్షలు ఎందుకు? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏపీ తాలిబన్ల పాలనలో ఉందా? అరెస్టులతో కర్ఫ్యూ వాతావరణం తెచ్చారు. మేం దొంగలమా? బందిపోట్లమా? నిజంగా ఉద్యోగాలిచ్చి ఉంటే ఎందుకు భయపడతారు? ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం?రెండు రోజులుగా పోలీసులు మమ్మల్ని నియంత్రిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవలసిన అవసరం ఏముంది? మీకు భయపడాల్సిన అవసరం మాకు లేదు’ అని ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు.

నాన్న ఆత్మ క్షోభిస్తుంది

‘నా పరిస్థితి చూసి నాన్న (వైఎస్‌ఆర్‌) ఆత్మ క్షోభిస్తుంది. అమ్మ కూడా బాధ పడుతుంది. పోలీసులే నా చేతికి గాయం చేశారు. రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదని పోరాటం చేసి.. వినతి పత్రం ఇవ్వడానికి కూడా హక్కు లేదా? మాట్లాడటానికీ స్వేచ్ఛ లేదా? వినతి పత్రం తీసుకునేందుకు సచివాలయంలో సీఎం, మంత్రులు, కనీసం సీఎస్‌ కూడా లేరట. ఈ విధంగా ఉంటే పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు ’ అని షర్మిల ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని