కేంద్రం చేసిన అన్యాయంపై సీఎం శ్వేతపత్రం ప్రకటించాలి: బీవీ రాఘవులు

తెలంగాణకు విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ఎలా అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు.

Updated : 24 Feb 2024 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ఎలా అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. గంగానది ప్రక్షాళనకు నిధులిస్తున్న కేంద్రం మూసీ సుందరీకరణకు ఎందుకు ఇవ్వట్లేదని, ఈ విషయంలో కేంద్రంపై అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశాల సందర్భంగా రెండోరోజైన శుక్రవారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, తెలంగాణలో ఆ పార్టీని లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు దేశంలో ఉమ్మడి శక్తి బయల్దేరిందని తెలిపారు.

నాలుగు స్థానాలపై దృష్టి.. ఒకట్రెండు చోట్ల పోటీ

ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల్లో ఏ నియోజకవర్గం ఇచ్చినా కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని సీపీఎం విస్తృత సమావేశాల్లో నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా ఇవ్వకుంటే సొంతంగా బరిలో దిగాలని.. ఒకట్రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సమావేశాలకు పార్టీ నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, వీరయ్య తదితరులు హాజరయ్యారు. ఏడు అంశాలపై తీర్మానాలు చేసినట్లు పార్టీ నేతలు నాగయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజుల్లోగా హామీలు అమలు చేయకపోతే సీపీఎం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని