కులం పేరుతో రెచ్చగొడుతున్నారు

ప్రజలను కులం పేరుతో రెచ్చగొట్టి, వారి మధ్య చిచ్చుపెట్టే విధానాలపైనే ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు నమ్మకం ఉంచుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు.

Updated : 24 Feb 2024 04:05 IST

ఇండియా కూటమి సభ్యులపై ప్రధాని మోదీ విమర్శలు

వారణాసి: ప్రజలను కులం పేరుతో రెచ్చగొట్టి, వారి మధ్య చిచ్చుపెట్టే విధానాలపైనే ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు నమ్మకం ఉంచుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. దళితులు, గిరిజన ప్రజలు ఉన్నతస్థాయి పదవులు అలంకరించడాన్ని సైతం ప్రతిపక్ష నాయకులు సహించలేరని పేర్కొన్నారు. తాజా రాష్ట్రపతి ఎన్నికలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గురువారం రాత్రి తన సొంత నియోజకవర్గం వారణాసి చేరుకున్న ప్రధాని.. వెంటనే స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన శివ్‌పుర్‌- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను అర్ధరాత్రి వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. సంత్‌ రవిదాస్‌ 647వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడారు.

‘‘ప్రతి యుగంలోనూ సన్యాసుల ప్రసంగాలు మనకు మార్గం చూపుతాయి. మనల్ని అప్రమత్తం చేస్తాయి. మనదేశంలో ఎవరైనా కులం పేరుతో వివక్షకు పాల్పడితే అది మానవత్వాన్ని దెబ్బతీస్తుంది. కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం, వారి మధ్య చిచ్చుపెట్టడం వంటివాటిని నమ్మే, దళితులు, అణగారిన వర్గాలకు ఉద్దేశించిన పథకాలను వ్యతిరేకించే ‘ఇండీ గఠ్‌బంధన్‌’ను ప్రతిఒక్క దళిత, వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తీ గుర్తుంచుకోవాలి’’ అని పేర్కొన్నారు. సంత్‌ రవిదాస్‌ జన్మస్థలంలో రూ.32 కోట్లతో చేపట్టిన వివిధ అభివృధ్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పథకాన్ని తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించిన మోదీ.. ఇంత పెద్ద పథకం ఏ దేశంలోనూ లేదన్నారు. రానున్న ఐదేళ్లలో భారతదేశం అభివృద్ధికి నమూనాగా మారుతుందని, ఇదే ‘మోదీ గ్యారెంటీ’ అని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ ఆధునికత ఎలా అభివృద్ధి చెందిందో ప్రపంచం చూస్తోందనడానికి కాశీ చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు

వారణాసిలో రూ.13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వీటిలో అనేక రహదారులు, వంటగ్యాస్‌ సిలిండర్లు నింపే కేంద్రం, పాల శుద్ధి కేంద్రం, నూతన వైద్య కళాశాల వంటివి ఉన్నాయి.

మతిస్థిమితం లేనివారే యువతను తాగుబోతులంటారు

వారణాసి రోడ్లపై యువత తాగి పడిఉండడాన్ని చూశానంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మతిస్థిమితం లేనివారే యువతను తాగుబోతులంటారని విమర్శించారు. కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌ కొన్ని దశాబ్దాలపాటు అభివృద్ధికి దూరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ రాజకుటుంబానికి చెందిన సభ్యుడొకరు వారణాసి యువతను తాగుబోతులంటున్నారు. మతిస్థిమితం లేనివారే  యువతను తాగుబోతులంటారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని