దీదీని ఒప్పించేలా కొత్త ఫార్ములా!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏకాభ్రిపాయానికి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Published : 24 Feb 2024 03:52 IST

ఐదు స్థానాలకు అంగీకరించే అవకాశం
బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై టీఎంసీతో కాంగ్రెస్‌ చర్చలు

దిల్లీ/ముంబయి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏకాభ్రిపాయానికి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీలతో చర్చలు ఓ కొలిక్కి రాగా...పశ్చిమబెంగాల్‌లో టీఎంసీని, మహారాష్ట్రలో శివసేన(యూబీటీ)ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌కు తమ రాష్ట్రంలో రెండు స్థానాలకు మించి ఇవ్వలేమని టీఎంసీ ఛైర్‌పర్సన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పడంతో రెండు పార్టీల మధ్య ఇదివరకు చర్చలు నిలిచిపోయాయి. మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ కొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా 5 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలుచుకున్న సీట్లను కేటాయించాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బెహ్రాంపుర్‌, మాల్దా సౌత్‌, మాల్దా నార్త్‌, రాయ్‌గంజ్‌, డార్జిలింగ్‌ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీదీ కూడా అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  


రంగంలోకి రాహుల్‌ గాంధీ...

మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. ఆ రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా 8 సీట్ల విషయమై మహావికాస్‌ అఘాడీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ముంబయి పరిధిలో 6 లోక్‌సభ స్థానాలు ఉండగా... 3చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయాలని భావిస్తోంది. ఉద్ధవ్‌ వర్గం ముంబయిలో 4 సీట్లు సహా మొత్తం 18 స్థానాలు కావాలని కోరుతోంది. 2019లో శిందే వర్గం విడిపోక ముందు శివసేన 22 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి 18 చోట్ల గెలుపొందింది. వాటిలో మూడు ముంబయి పరిధిలోనివి. మరోవైపు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే శరద్‌ పవార్‌తోనూ రాహుల్‌ చర్చలు జరిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని