కేసీఆర్‌ తరహాలోనే కాంగ్రెస్‌ పాలన

కాంగ్రెస్‌ పార్టీకి అవినీతి, నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయని, 70 ఏళ్ల పాలనలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 24 Feb 2024 03:58 IST

భారాస ఒక్క సీటు గెలిచినా వృథానే..
విజయ సంకల్పయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, ఆసిఫాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి అవినీతి, నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయని, 70 ఏళ్ల పాలనలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. ఎన్నికల అనంతరం రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. భాజపా చేపట్టిన విజయ సంకల్పయాత్ర నాలుగో రోజు కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో కొనసాగింది. కాగజ్‌నగర్‌, తాండూరు, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాలలో నిర్వహించిన రోడ్‌షోలు, సభల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని పదేళ్లపాటు ఇసుక, భూ, మద్యం, డ్రగ్‌ మాఫియాలతో దోచుకుంది. భారాస నేతలు సింగరేణి భూములను ఆక్రమించుకున్నారు. భారాస ఒక్క సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

కాంగ్రెస్‌ కర్ణాటక ప్రజలను అయిదు గ్యారంటీలతో మభ్యపెట్టింది. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను క్షమించమని కోరుతున్నారు. ఇక తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తుంది..? మద్యపాన తెలంగాణగా మార్చారని శాసనసభ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆరోపించారు. అధికారంలోకి వస్తే మద్యం గొలుసు దుకాణాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం కేసీఆర్‌ తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారు. ఉచిత బస్సులతో ప్రజల కడుపు నిండదు. మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ ప్రజల 500 ఏళ్ల కల రామమందిర నిర్మాణాన్ని అన్నివర్గాల మద్దతుతో పూర్తి చేశారు’ అని పేర్కొన్నారు. యాత్రలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, సిర్పూరు, ముథోల్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పటేల్‌, పాయల్‌ శంకర్‌, రమేశ్‌ రాఠోడ్‌, బొడిగ శోభ, ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు