రాజకీయ రంగు పులుముకున్న ఏపీపీఎస్సీ

రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే మరోవైపు ఏపీపీఎస్సీ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య విమర్శించారు.

Published : 24 Feb 2024 05:43 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే మరోవైపు ఏపీపీఎస్సీ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య విమర్శించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లను సక్రమంగా వెలువరించడం లేదని, అభ్యర్థులు సిద్ధమవ్వడానికి కూడా సమయం ఇవ్వడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నట్లు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే వారికి సమాన అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థలా కాకుండా అధికార పార్టీ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోంది. గ్రూప్‌-1 పరీక్షకు మరో రెండు నెలలు గడువు ఇవ్వాలి. లేకుంటే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.

ఇసుక దోపిడీపై నేడు తెదేపా, జనసేన ఆందోళనలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై తెదేపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ఇసుక రేవుల్లో వైకాపా నాయకులు తవ్వకాలు సాగిస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు, ఎన్జీటీ ఆదేశాల్ని బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయా రీచ్‌ల వద్ద రెండు పార్టీల శ్రేణులు నిరసన తెలపడంతో పాటు ఇసుక దోపిడీ ప్రజలకు చూపేలా ఫొటోలు తీసి, సెల్ఫీలు దిగి వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.


‘సిద్ధం’ సభలకు ఆర్టీసీ బస్సులు తరలించకుండా ఆదేశాలివ్వండి

సీఎస్‌కు అచ్చెన్నాయుడు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు పంపితే సామాన్య ప్రయాణికుల పరిస్థితేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రస్తుతం వివాహాల సీజన్‌ కావడంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకొని అధికార పార్టీ కార్యక్రమాలకు బస్సులు తరలించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి శుక్రవారం ఆయన లేఖ రాశారు. లేఖ ప్రతుల్ని సీఈసీకి, ఆర్టీసీ ఎండీకి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని