ఓట్ల తొలగింపునకు వైకాపా కుట్ర!

దొంగ ఓట్లు చేర్చడంతోపాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు, తమకు మద్దతుగా ఉండబోరని భావించిన వారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు.

Published : 24 Feb 2024 05:46 IST

తటస్థుల ఓట్లు తొలగించేలా దరఖాస్తులు
విశాఖ పశ్చిమ వైకాపా నేత ఇష్టారాజ్యం
10 మందిపై కేసు నమోదు
ఇందులో వైకాపా బీఎల్‌ఏలు, ఆ పార్టీ ఇన్‌ఛార్జి వద్ద పనిచేసే వ్యక్తులు

ఈనాడు- విశాఖపట్నం, న్యూస్‌టుడే- గోపాలపట్నం: దొంగ ఓట్లు చేర్చడంతోపాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు, తమకు మద్దతుగా ఉండబోరని భావించిన వారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పుడు వివరాలతో ఫారం-7 దరఖాస్తులు చేసిన పది మందిపై గోపాలపట్నం, మల్కాపురం, కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్లలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం, ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, ఇతరుల చట్టబద్ధమైన హక్కులకు ఇబ్బంది కలిగించడం, కావాలనే తప్పుడు పత్రాలు అందజేయడం అనే నేరాల కింద 177, 181, 182, 192, 193, ఐపీసీ 66-సి, 66-డి, ఐటీఏ చట్టం 2000-2008 31(ఎ) సెక్షన్లు పెట్టారు. ఇది నిరూపణ అయితే ఆర్నెల్ల జైలు శిక్ష, రూ.వెయ్యి అపరాధ రుసుం, తీవ్రమైతే రెండేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుం విధిస్తారు. లేదా రెండు శిక్షలూ విధించొచ్చు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు వారికి ఎటువంటి నోటీసులూ అందజేయలేదని సమాచారం.

అంతా వైకాపా సేవకులే..

66 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన బి.రంగనాయకమ్మ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వైకాపా పశ్చిమ ఇన్‌ఛార్జి ఆడారి ఆనందకుమార్‌కు చెందిన పార్టీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తారని తెలిసింది. వార్డు వాలంటీరు భార్య అయిన రొంగలి సుధ, వైకాపా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీలానాగవల్లి, వైకాపా 204 బీఎల్‌ఏ జి.నూకరాజుతోపాటు సాకూరి సత్యవతి, కొలిచాన రవి, ఎస్‌.సుజాత, టి.యశ్వంత్‌రావు, కె.సత్తిబాబు, జి.కావ్య అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు.

4,409 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు 163 మంది వ్యక్తులు ఒక్కొక్కరు పదికన్నా ఎక్కువ ఫారం- 7 దరఖాస్తులు చేశారు. వీరిలో వంద దరఖాస్తులు చేసినవారు కూడా ఉన్నారు. దీనిపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. 163 మంది నుంచి వచ్చిన 4,409 అభ్యంతరాలను పరిశీలించింది. ఇందులో 750 అభ్యంతరాల్లో 545 మంది.. ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామాలోనే ఉంటున్నారని, పనుల కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తేలడంతో వారి ఓట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరో 205 మంది జాబితాలో పేర్కొన్న చిరునామాలోనే ఉన్నారు. అయినా వీరి ఓట్లు తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేశారని నిర్ధారించారు. ఈ ఓట్లు తొలగించాలని ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసిన వారిని గుర్తించి, కేసులు పెట్టారు. సంబంధం లేని వ్యక్తుల ఓట్లు తొలగించాలని 163 మంది పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయడమే పెద్ద తప్పిదం. దాని తీవ్రతను తగ్గించేందుకు 10 మందిపై మాత్రమే కేసులు పెట్టి, మరో 13 మందిని హెచ్చరించి మిగిలినవారిని వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని