మూడు నెలల పోరాటంతో ఓటు హక్కు పునరుద్ధరణ

తెదేపా సానుభూతిపరులకు ఓటు హక్కు లేకుండా చేయాలనుకున్న వైకాపా నాయకుల కుయుక్తులు ఫలించలేదు. కలెక్టర్‌ ఆదేశాలతో ఎట్టకేలకు బాధితులకు న్యాయం జరిగింది.

Published : 24 Feb 2024 05:47 IST

తెదేపా సానుభూతిపరులకు ఊరట

వీరులపాడు, న్యూస్‌టుడే: తెదేపా సానుభూతిపరులకు ఓటు హక్కు లేకుండా చేయాలనుకున్న వైకాపా నాయకుల కుయుక్తులు ఫలించలేదు. కలెక్టర్‌ ఆదేశాలతో ఎట్టకేలకు బాధితులకు న్యాయం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో వైకాపాకు చెందిన వ్యక్తులకు రెండేసి ఓట్లు ఉన్నాయని స్థానిక తెదేపా నాయకులు ఎన్నికల అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా సుమారు 40 మంది తెదేపా సానుభూతిపరులు గ్రామంలో ఉండడం లేదని, వారి ఓట్లు తొలగించాలంటూ వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఏకపక్షంగా ఓట్లు తొలగించారు. దీనిపై స్థానిక తెదేపా నాయకుడు నిమ్మల రాజేంద్ర ఆధ్వర్యంలో బాధితులు జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జీవనోపాధి నిమిత్తం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే తమ ఓట్లు అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా తీసివేయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో పలుమార్లు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. కలెక్టరు డిల్లీరావు స్పందించి బాధితులను తన కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారించారు. గ్రామంలో మినహా మరెక్కడా బాధితులకు ఓటు లేదని తేలడంతో ఈ నెల 22న వారి ఓటు హక్కు పునరుద్ధరించారు. మూడు నెలల పోరాటం తర్వాత తమకు న్యాయం జరిగిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని