భూ బదిలీ పత్రాల పంపిణీ ఎన్నికల స్టంట్‌

ఒంగోలులో సెంటు స్థలాలకు సర్వహక్కులతో భూ బదిలీ పత్రాల పంపిణీ ఎన్నికల స్టంట్‌లో భాగమేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రతి పథకంలోనూ అవినీతినే వెతుక్కుంటారని ఆరోపించారు.

Published : 24 Feb 2024 05:48 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఒంగోలులో సెంటు స్థలాలకు సర్వహక్కులతో భూ బదిలీ పత్రాల పంపిణీ ఎన్నికల స్టంట్‌లో భాగమేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రతి పథకంలోనూ అవినీతినే వెతుక్కుంటారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్‌ ప్రసంగాలు, చేస్తున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అవినీతికి సహకరిస్తున్న అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ‘‘తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో గృహాల్ని లబ్ధిదారులకు ఇవ్వడానికి జగన్‌కు ఎందుకు మనసు రాలేదు. మచిలీపట్నం అభివృద్ధికి జగన్‌ రూ.50 కోట్లు ఇచ్చినట్టు మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’’ అని మండిపడ్డారు.

కబ్జా చేసిన వారు పేదల ద్రోహులు కాదా?: సోమిరెడ్డి

రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల ఎసైన్డు భూముల్ని కబ్జా చేసిన జే గ్యాంగ్‌ పేదల ద్రోహులు కాదా? అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తెదేపా ప్రభుత్వంలో 2 సెంట్లు ఇస్తే.. జగన్‌ దాన్ని సెంటుకు కుదించారని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘‘ఇళ్ల పట్టాల పేరుతో రూ.7 వేల కోట్ల అవినీతి చేశారు. గృహ నిర్మాణాల పేరుతో పేదల్ని అప్పులపాలు చేశారు. రాజధాని ప్రాంతంలో బయటి ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలిచ్చి పేదల మధ్య చిచ్చుపెట్టారు’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని