ఇసుక కుంభకోణం విలువ రూ.40,000 కోట్లు

రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో రూ. 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అనుమతులు లేకుండా ఇసుక తెగ తవ్వేశారన్నది నిజం.

Updated : 24 Feb 2024 06:15 IST

సీఎంకు ప్రాణహాని సాకు.. ప్రచారానికే హెలికాప్టర్లు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణ
ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడి

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో రూ. 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అనుమతులు లేకుండా ఇసుక తెగ తవ్వేశారన్నది నిజం. ఇందులో ప్రభుత్వ రాబడి ఎంత.. మిగిలింది ఎవరు తినేశారన్నది ప్రశ్న. దాని విలువ రూ. 40 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇసుకాసురుని నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు దారుణమైన వంచన జరిగిందనేది సత్యం. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీని ఆశ్రయించి, న్యాయం కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించింది. మిర్యాలగూడ నుంచి నాలుగు మద్యం సీసాలను తెచ్చుకొని అమ్ముకుంటున్నట్లుగా అతనిపై తప్పుడు అభియోగం మోపడం హాస్యాస్పదం. గతంలో నేను కూడా న్యాయం కోసం పోరాడితే, ఈ ప్రభుత్వ పెద్దలు చంపాలని చూశారు’ అని అన్నారు.

హెలికాప్టర్లపై ఈసీకి లేఖ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ, రక్షణ నిమిత్తం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలని ఒక పోలీసు అధికారి ప్రభుత్వానికి సూచించడం విడ్డూరంగా ఉందని రఘురామ తెలిపారు. ప్రాణహాని ఉంటే ఇకపై ముఖ్యమంత్రి నేలపై నడవరా.. గాల్లోనే తిరుగుతారా.. అని ప్రశ్నించారు. ప్రాణహాని సాకుతో ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లను అద్దె తీసుకొని ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపైకి నెట్టివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కావాలంటే ప్రచారం కోసం పార్టీ సొమ్ముతో హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవచ్చని, అంతేతప్ప ప్రజాధనం వెచ్చించి ఒక్కొక్క హెలికాప్టర్‌ను నెలకు రూ. 1.91 కోట్ల అద్దెకు తీసుకోవాలని పోలీసులు సూచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. పైలెట్‌కు, ఇతరత్రా ఖర్చులకు రూ. 40 లక్షల వరకు అదనంగా వెచ్చించవలసి రావచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో డబ్బులు తరలించవచ్చని కూడా ఆలోచిస్తుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి జీతాన్నే తీసుకుంటానని చెప్పే జగన్‌, తన ఇంటి రిపేర్ల కోసం రూ. 50 - 60 కోట్లు ఖర్చు చేయడం చూశామన్నారు. ప్రజాధనంతో హెలికాప్టర్లను పెట్టుకొని ఎన్నికల ప్రచారం సాగించాలనుకోవడంపై తాను ఈసీకి లేఖ రాసినట్లు చెప్పారు.

నరసాపురం కూటమి అభ్యర్థి నేనే

తాడేపల్లిగూడెంలో తెదేపా, జనసేన బహిరంగ సభ జరిగే నాటికి కూటమిలో భాజపా చేరే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ సభలో తాను పాల్గొంటానని చెప్పారు. రేపోమాపో దిక్కుమాలిన పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నరసాపురం అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని