ఇసుక తవ్వకాలపై వెంకటరెడ్డికి జైలు ఖాయం!

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎస్‌ఈఐఎఎ)కు తప్పుడు నివేదికలిచ్చిన గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి జైలుకెళ్లడం ఖాయమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు.

Published : 24 Feb 2024 05:50 IST

ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారం సీఎస్‌ ఎందుకు సమీక్షించలేదు?
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎస్‌ఈఐఎఎ)కు తప్పుడు నివేదికలిచ్చిన గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి జైలుకెళ్లడం ఖాయమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. సీఎం జగన్‌ ఇసుక దోపిడీ అక్షరసత్యమని, ఇసుకాసురుడి దోపిడీ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలు వాస్తవమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నివేదికతో నిర్ధారణ అయిందన్నారు. ఇసుక అక్రమాలకు సహకరించిన కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి జగన్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2021 ఫిబ్రవరి 26న జాతీయ హరిత ట్రైబ్యునల్‌, న్యూదిల్లీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల్ని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించాలి. ఆ కమిటీ రేవులను కనీసం మూడుసార్లు తనిఖీ చేయాలి. కమిటీ నివేదికపై మూడు నెలలకోసారి సీఎస్‌ సమీక్షించాలి. కానీ జవహర్‌రెడ్డి ఒక్కసారి కూడా ఎందుకు సమీక్షించలేదు? ఇసుక తవ్వకాల్ని ఆపాలని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ జే గ్యాంగ్‌ దోపిడీ కొనసాగింది. రాష్ట్రస్థాయి అధికారులు మాత్రం జగన్‌కు దాసోహమై పనిచేశారు. ఎన్జీటీని తప్పుదారి పట్టించి జగన్‌రెడ్డి ఇసుక దోపిడీకి సహకరించారు. అధికారులు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నిజాయితీగా వ్యవహరిస్తారా.. లేక ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిలా జైలుకెళతారా?’’ అని పట్టాభి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని