Guntur: గుంటూరులో ఫ్లెక్సీల రగడ

తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాత్రికి రాత్రి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నూరి ఫాతిమా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రగడకు దారి తీసింది.

Updated : 24 Feb 2024 08:03 IST

తెదేపా కట్టిన వాటిపై వైకాపా ఫ్లెక్సీలు
తొలగించే క్రమంలో ఇరుపార్టీల మధ్య తోపులాట

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాత్రికి రాత్రి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నూరి ఫాతిమా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రగడకు దారి తీసింది. పెమ్మసాని చంద్రశేఖర్‌ నగరపాలక సంస్థకు డబ్బు చెల్లించి అనుమతులు తీసుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని సెంటర్‌ డివైడర్‌ హోర్డింగ్‌లపై ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలపై నూరి ఫాతిమా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తెదేపా గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మహమ్మద్‌ నసీర్‌, బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ ఎల్లావుల అశోక్‌ తదితరులు వాటిని తొలగించడం ప్రారంభించారు. కొన్ని తొలగించాక వైకాపా నాయకులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకూ సర్ది చెప్పారు. అన్ని అనుమతులూ తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. వాటిపై ఏవిధంగా వైకాపా వారు ఫ్లెక్సీలు కడతారని నసీర్‌ ప్రశ్నించారు. వైకాపా, పోలీసుల తీరును నిరసిస్తూ మాయాబజార్‌ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నందున ఆందోళన విరమించాలని పోలీసులు కోరడంతో తెదేపా నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ లోపలకు అనుమతించకపోవడంతో నిరసనకు దిగారు. నసీర్‌తో పాటు కొందరిని లోపలకు అనుమతించడంతో అడిషనల్‌ కమిషనర్‌ రాజ్యలక్ష్మితో వారు చర్చలు జరిపారు. 24 గంటల్లోగా వైకాపా ఫ్లెక్సీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే కార్పొరేషన్‌ చుట్టూ తెదేపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ముట్టడిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని