రాబోయే కురుక్షేత్రానికి సిద్ధమవ్వాలి

‘రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం.. పోరాటానికి అందరూ సిద్ధమై అధికార వైకాపాను గద్దె దించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Published : 24 Feb 2024 05:56 IST

వైకాపాను గద్దె దించితేనే రాష్ట్రానికి మేలు
‘నిజం గెలవాలి’లో నారా భువనేశ్వరి

ఈనాడు-చిత్తూరు, తిరుపతి, న్యూస్‌టుడే-కాణిపాకం, నారాయణవనం: ‘రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం.. పోరాటానికి అందరూ సిద్ధమై అధికార వైకాపాను గద్దె దించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆమె చిత్తూరు గ్రామీణ మండలం ముత్తుకూరు, ఎస్‌ఆర్‌పురం మండలం గంగమ్మ గుడి, నారాయణవనం మండలం తుంబూరు గ్రామాల్లో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన మోహన్‌ నాయుడు, ఆంజనేయ నాయుడు, కుమ్మరి మునివేలు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఆయా చోట్ల భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని గంజాయికి చిరునామాగా మార్చారు. వైకాపా నాయకులు ఓ యువతికి గంజాయి అలవాటు చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అందరినీ భయపెట్టి వాళ్లు మళ్లీ గెలుద్దామని చూస్తున్నారు. అయిదేళ్లుగా తెదేపా కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. తెదేపా అధికారంలోకి వస్తేనే మహిళలపై దాడులు తగ్గుతాయి. వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’ అని తెలిపారు. నారాయణవనం మండలంలో కార్యకర్తలు భువనేశ్వరి నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేయగా.. ఆమె వారించి చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్‌, గంగాధరనెల్లూరు తెదేపా ఇన్‌ఛార్జి థామస్‌, నాయకులు దొరబాబు, కఠారి హేమలత పాల్గొన్నారు.

స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆదిమూలం..

నారాయణవనం మండలంలో పుత్తూరు క్రాస్‌ వద్ద భువనేశ్వరికి సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు నారాయణవనం జడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమన్‌కుమార్‌ స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం విమానాశ్రయం వద్దకు వెళ్లి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని