సీపీఎం, సీపీఐలతో కలిసి ఎన్నికల్లో పోటీ

రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఏపీలో వైకాపా, దేశంలో భాజపా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని మూడు పార్టీలూ నిర్ణయానికి వచ్చాయి.

Published : 24 Feb 2024 05:57 IST

సీట్ల సర్దుబాటుపై త్వరలో స్పష్టత
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడి
ఒత్తిళ్లకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తలొగ్గారని వ్యాఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఏపీలో వైకాపా, దేశంలో భాజపా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని మూడు పార్టీలూ నిర్ణయానికి వచ్చాయి. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. త్వరలో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. సమావేశం అనంతరం షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పదేళ్లుగా రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయి. భాజపా ప్రభుత్వం.. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. మూడు రాజధానులు చేస్తామని జగన్‌.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్‌. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నాం. ఇకపై కలిసికట్టుగా పోరాడతాం. లేదంటే ఈ పెద్ద పర్వతాలను ఢీకొట్టడం అసాధ్యం. అనంతపురంలో ఈ నెల 26న తలపెట్టిన సభకు ఇరు పార్టీలను ఆహ్వానించాం. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని తెలిపారు.

ఆర్కేపై ఒత్తిడిని చెల్లిగా అర్థం చేసుకోగలను

‘మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాకు ఎంతో ఆప్తుడు. కాంగ్రెస్‌లోకి వచ్చాక ఆయనపై ఒత్తిడి పెరిగింది. అందుకే తిరిగి వైకాపాలో చేరారు. చెల్లిగా అది నేను అర్థం చేసుకోగలను. ఆయన ఎక్కడున్నా బాగుండాలి. ఆయన మంచి వ్యక్తి.. కానీ ఉండకూడని ప్రదేశంలో ఉన్నారు (రైట్‌ పర్సన్‌ ఇన్‌ రాంగ్‌ ప్లేస్‌)’ అని షర్మిల అన్నారు.

ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దిల్లీలో తాకట్టుపెట్టిన జగన్‌

‘భాజపా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. ఇక్కడ ఒక్క శాతం ఓటు షేర్‌ కూడా లేని భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోంది. భాజపా ముఖ్యమంత్రులు కూడా వెళ్లనన్నిసార్లు దిల్లీ వెళ్లిన జగన్‌  రాష్ట్రానికి ఏం సాధించారు? స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్‌ దిల్లీ వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐలతో కలిసి పోటీ చేసి భాజపాను, వారు కొమ్ముకాసే వైకాపాను సాగనంపుతాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘కేంద్రంలోని భాజపా బ్లాక్‌మెయిల్‌, బెదిరింపు, ఫిరాయింపు రాజకీయాలు చేస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలన్నీ మోదీకి భయపడుతున్నాయి. రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసింది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇతర ప్రజాతంత్ర పార్టీలను కూడా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని