దూకుడుగా తొలి అడుగు

రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్‌ చేస్తూ తెదేపా, జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Updated : 25 Feb 2024 12:55 IST

99 స్థానాలకు తెదేపా-జనసేన అభ్యర్థుల ఖరారు
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తొలి జాబితా
యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు
భాజపాతో పొత్తు కొలిక్కి వచ్చాక మలి జాబితా
ఈనాడు - అమరావతి

రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్‌ చేస్తూ తెదేపా, జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం, గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్నా, తెదేపా, జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్నా ఇలా ముందడుగు వేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైకాపా.. పేరుకు ఏడు విడతలుగా 65 మందితో జాబితాలు విడుదల చేసినా అవన్నీ పార్టీ సమన్వయకర్తలుగా చేపట్టిన ఎంపికలే. వీరే అభ్యర్థులు అవుతారా.. అన్నది చివరివరకూ సందేహాస్పదమే. పైగా ఎంపిక చేసినప్పుడే వీరు ఖరారైనట్లు కాదని, మార్పులూచేర్పులూ ఉంటాయని అధిష్ఠానం చెప్పింది. అన్నట్లుగానే, ఇప్పటికే ఐదారుగురిని మార్చింది. విజయావకాశాలపై నమ్మకం లేక కొందరు స్వతహాగా వైదొలిగారు. ఈ పరిణామాల్ని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది తెదేపా- జనసేన కూటమి మాత్రమే.

గతానికి భిన్నంగా..

సాధారణంగా ఎన్నికల షెడ్యూలు వచ్చేవరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తీసుకురారన్నది తెదేపా అధినేత చంద్రబాబుకున్న పేరు. నామినేషన్ల దాఖలు గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా.. పేర్లు ప్రకటించిన సందర్భాలున్నాయి. అలాంటిది ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించటం విశేషమే. భాజపాతో పొత్తు ప్రతిపాదన రాకముందు.. ఒకేసారి మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని తెదేపా, జనసేన భావించాయి. తర్వాత వ్యూహం మార్చుకున్నాయి. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల ఎంపికకు ఈ స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబే స్వయంగా పేర్కొన్నారు. వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ.. యువతకు, కొత్తవారికి, మహిళలకు, బలహీన వర్గాలకూ ప్రాధాన్యమిస్తూ, పార్టీకి బలమైన, ముఖ్యమైన స్థానాలనూ మిత్రపక్షానికి కేటాయించేందుకూ సమ్మతిస్తూ తెదేపా నాయకత్వం విస్తృత కసరత్తు చేసింది. ఐవీఆర్‌ఎస్‌ విధానంలో 1.03 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించి, విశ్లేషించి, మూణ్నాలుగు రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను వడపోసింది. దీనికోసం పార్టీ అంతర్గత విభాగం (బ్యాక్‌ ఆఫీస్‌) నాలుగైదు దశల్లో కసరత్తు చేసింది. ప్రకటించిన వాటిల్లో ఎక్కువ స్థానాల్లో ఊహించిన అభ్యర్థులే ఉన్నట్లు కనిపిస్తున్నా.. గుర్తించదగిన స్థాయిలో మార్పులూ ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందికర నిర్ణయాలూ తీసుకున్నారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో సహా అనకాపల్లి, నెల్లిమర్ల, రాజానగరంలో తెదేపాకు బలమైన అభ్యర్థులున్నా పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చింది.

ఆ స్థానాలపై లోతుగా కసరత్తు..

పార్టీకున్న సిట్టింగ్‌ల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావులకు తప్ప అందరికీ అవకాశమిచ్చారు. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలపాలనే ప్రతిపాదన ఇంకా కొలిక్కిరాలేదు. రాజమహేంద్రవరం గ్రామీణ స్థానాన్ని జనసేన కోరుతున్నందున బుచ్చయ్యచౌదరి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడింది. వైకాపా నుంచి వచ్చిన వారిలో సిట్టింగులైన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఎక్కడి నుంచి బరిలో నిలపాలన్న చర్చ జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవి పేరు బాపట్ల లోక్‌సభ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డి (నెల్లూరు గ్రామీణం), పార్థసారథి (నూజివీడు)లకు తొలి జాబితాలోనే అవకాశం లభించింది. మేకపాటి చంద్రశేఖరరెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, బుచ్చయ్యచౌదరి, దేవినేని ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధప్రసాద్‌, చింతమనేని ప్రభాకర్‌ వంటి సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. రాజమహేంద్రవరం గ్రామీణ, అవనిగడ్డ, పెందుర్తి స్థానాలను జనసేన అడుగుతోంది. కొందరి అభ్యర్థిత్వాలపై సంప్రదింపులు కొలిక్కి రాకపోవటం, ఇంకొందరికి స్థానాలు మార్చడం, వేరే అవకాశాలు కల్పించాలని భావించటం, తొలి జాబితాను 99 సంఖ్యకు పరిమితం చేయాలనుకోవడం తదితర కారణాలతో వీరి పేర్లు లేవని పార్టీ వర్గాల కథనం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మినహా మరే నాయకుడి కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో కోట్ల, భూమా, కేఈ, జేసీ కుటుంబాల నుంచి ఒక్కొక్కరే బరిలో నిలవనున్నారు. సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు ఈసారి పోటీకి ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఆయన కుమార్తె అదితి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు.

మలి జాబితాకి మరింత సమయం

తెదేపా- జనసేనల రెండో జాబితాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. జనసేన కోరుకుంటున్న స్థానాల్లో కొన్నింట్లో తెదేపా తరఫున బలమైన అభ్యర్థులుండటం, మొదటి నుంచి పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు కావడంతో చర్చలు కొలిక్కిరావటం అంత సులువయ్యేలా లేదు. భాజపా నేతలు ఆసక్తి చూపుతున్న స్థానాలను తొలి జాబితా నుంచి మినహాయించారు. ఆ పార్టీ నేతలతో వచ్చే వారం చర్చించే అవకాశముంది. మార్చి మొదటి వారానికల్లా మిగిలిన శాసనసభ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కివచ్చే వీలుంది. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో క్లిష్టమైన, ఉత్కంఠకు తావిచ్చే నియోజకవర్గాలు మలి విడతలో ఎక్కువగా ఉండనున్నాయి. భాజపా లోక్‌సభ స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని సమాచారం.


కొత్త తరానికి అవకాశం

సారి కొత్త తరాన్ని గణనీయంగా తెరపైకి తెచ్చారు. మహాసేన రాజేష్‌గా గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, దళిత నాయకుడైన రాజేష్‌కుమార్‌కు పి.గన్నవరం నుంచి అవకాశమిచ్చారు. రాజధాని అమరావతి ఉద్యమంతోపాటు చంద్రబాబు అరెస్టు సమయంలో యువత, ఐటీ ఉద్యోగులను సమీకరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి బరిలో నిలిపారు. ఇది సంచలనం, సాహసోపేతమే. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో మునుపెన్నడూ లేనంత కొత్తతరాన్ని తీసుకొచ్చారు. సీనియర్‌ నాయకులకు వారసులుగా యువతకు అవకాశమిచ్చారు. అత్యధికులు ఉన్నత విద్యావంతులు. వీరి సగటు వయసు 52. 35 ఏళ్లలోపు వారు ఇద్దరుంటే, 36-45 ఏళ్ల మధ్య వయస్కులు 22 మంది ఉన్నారు. రాజకీయాలకు కొత్తవారు 23 మంది. రాబోయే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే స్థాయి, ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు. అభ్యర్థులకు క్లీన్‌ ఇమేజ్‌ ఉండేలా జాగ్రత్తలూ తీసుకున్నారు. గుడివాడ, ఉదయగిరిల్లో ఎన్‌ఆర్‌ఐలకూ అవకాశమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు