4 రాష్ట్రాల్లో ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తు ఖరారు

విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగసామ్య పక్షాలైన కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల మధ్య లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఖరారయ్యింది.

Updated : 25 Feb 2024 06:55 IST

దిల్లీ, గుజరాత్‌, గోవా, హరియాణాల్లో లోక్‌సభ సీట్ల సర్దుబాటు కొలిక్కి

దిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగసామ్య పక్షాలైన కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల మధ్య లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఖరారయ్యింది. దిల్లీ, గుజరాత్‌, గోవా, హరియాణాల్లో పొత్తు కుదుర్చుకున్న ఈ రెండు పార్టీలు ఆప్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం విడివిడిగానే పోటీకి దిగనున్నాయి. ఆ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు శనివారం దిల్లీలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌, ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ తెలిపారు.

  • దిల్లీలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో(న్యూదిల్లీ, పశ్చిమ దిల్లీ, దక్షిణ దిల్లీ, తూర్పు దిల్లీ) ఆప్‌ పోటీ చేస్తుంది.. మిగిలిన మూడు సీట్లను(చాందినీచౌక్‌, ఈశాన్య దిల్లీ, వాయవ్య దిల్లీ) కాంగ్రెస్‌కు కేటాయించారు.
  • గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ సీట్లలో..ఆమ్‌ ఆద్మీకి రెండు స్థానాలు (భరూచ్‌, భావ్‌నగర్‌) ఇచ్చారు. మిగిలిన 24 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేసేలా అవగాహన కుదిరింది.
  • గోవాలోని రెండు లోక్‌సభ సీట్లు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఏకైక స్థానంలో కాంగ్రెస్సే పోటీ చేస్తుంది.
  • హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ సీట్లలో తొమ్మిది కాంగ్రెస్‌కు, మిగిలిన ఒకటి(కురుక్షేత్ర) ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేటాయిస్తూ ఒప్పందం ఖరారైందని ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు.
  • ప్రత్యేక పరిస్థితులున్న పంజాబ్‌ రాష్ట్రంలో మాత్రం ఎవరికి వారుగా పోటీ చేయాలని రెండు పార్టీలు అవగాహనకు వచ్చినట్లుగా వెల్లడించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని