లక్ష్యం 370 ఛేదించాలంటే!

సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి ప్రధాని మోదీ నిర్దేశించిన సరికొత్త లక్ష్యం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Published : 25 Feb 2024 04:07 IST

ప్రస్తుత సీట్లకు అదనంగా 67 సాధించాలి
లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలపై భాజపా గురి
ఆసక్తికరంగా మారిన కమలదళ వ్యూహాలు

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి ప్రధాని మోదీ నిర్దేశించిన సరికొత్త లక్ష్యం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ దఫా భాజపా ఒంటరిగా 370, ఎన్డీయే కూటమితో కలిసి 400 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలన్నది భాజపా అగ్రనేతల వ్యూహం. భాజపా అత్యంత పటిష్ఠంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఆ పార్టీ సీట్లు గెలుచుకొంది. 2019లో మొత్తం 303 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ ఇప్పుడు అదనంగా మరో 67 సీట్లు గెలుచుకుంటేనే తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. హిందీ రాష్ట్రాల్లో మోదీ ప్రభంజనం కొనసాగుతుండడంతో ప్రత్యర్థి పార్టీలపై భాజపా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 2014 కంటే 2019లో 21 లోక్‌సభ సీట్లు అధికంగా గెలుచుకొని ఆ పార్టీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గెలుచుకోవాల్సి ఉంది.

  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో.... కమలం పార్టీ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ, త్రిపుర, ఉత్తరాఖండ్‌, చండీగఢ్‌, దమణ్‌- దీవ్‌) ఒంటరిగా 99 స్థానాల్లో పోటీ చేసి వాటన్నింటినీ కైవసం చేసుకొని 100% ఫలితాలను సాధించింది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లోని ఆ స్థానాలను నిలుపుకోవడం మినహా కొత్తగా దక్కించుకోవడానికి ఏమీ ఉండదు.
  • మరో నాలుగు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం)... 91 సీట్లలో పోటీచేసి 85 సీట్లను గెలుచుకొని సగటున 93.40% ఫలితాలు సాధించింది. ఇక్కడ మరో 6 సీట్లు కైవసం చేసుకోవడానికి మాత్రమే ఆ పార్టీకి అవకాశం ఉంది.
  • 80 శాతానికి పైగా ఫలితాలు సాధించిన ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మరో 4 సీట్లు గెలుచుకోవడానికి మాత్రమే వీలుంది.
  • డెబ్బై శాతం విజయాలు సాధించిన ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రితం సారి లాగానే 78 సీట్లకు పోటీ చేస్తే గరిష్ఠంగా మరో 16 సీట్లు గెలుచుకోవడానికి వీలుంది. అంటే క్రితం ఎన్నికల్లో 70% నుంచి 90%వరకు ఫలితాలు సాధించిన రాష్ట్రాల్లో కొత్తగా 26 సీట్లు కైవసం చేసుకోవడానికి కమలం పార్టీకి అవకాశం ఉంది. అప్పుడు ఈ 18 రాష్ట్రాల్లో భాజపా పోటీ చేసిన అన్ని స్థానాలనూ 100% గెలుచుకోగలగాలి.
  • ప్రధాని మోదీ నిర్దేశించిన 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కమలదళం... ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవాలి. 2019లో ఈ అయిదు రాష్ట్రాల్లోని 99 స్థానాలకు గాను 89 స్థానాల్లో పోటీ చేసి 35 చోట్ల విజయం సాధించింది. ఇక్కడ ఇంకా 54 స్థానాలను గెలుచుకోవడానికి అవకాశం ఉంది.
  • 93 లోక్‌సభ స్థానాలున్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, తమిళనాడు, అండమాన్‌, దాద్రానగర్‌ హవేలీ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి) గతంలో 51 స్థానాల్లో పోటీ చేసి భాజపా ఒక్క సీటును కూడా పొందలేకపోయింది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఎన్ని స్థానాలు వస్తాయన్నది ఆసక్తికరం.
  • క్రితంసారి ఎన్డీయే కూటమి 11 రాష్ట్రాల్లో ఉంది. అక్కడున్న 322 స్థానాలకు గాను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 104 స్థానాల్లో పోటీచేసి 49 సీట్లు గెలుచుకున్నాయి. భాజపా లక్ష్యం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా 370 సీట్లు సాధిస్తే, ఎన్డీయే కూటమి పక్షాలు గతంలో గెలిచిన సీట్లను నిలబెట్టుకుంటే చాలు కూటమి సంఖ్య 419కి చేరుతుంది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న పెద్ద పార్టీల్లో ఏఐఏడీఎంకే, శివసేన ఉద్ధవ్‌ఠాక్రే, అకాలీదళ్‌లు ఇప్పుడు లేవు. కొత్తగా ఆర్‌ఎల్‌డీ, శివసేన ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ అజిత్‌పవార్‌ వర్గాలు చేరాయి. తెదేపా, అకాలీదళ్‌లు ఇంకా చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలకు భాజపా ఎన్ని స్థానాలు కేటాయిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని