కాంగ్రెస్‌ ఎజెండాలో దేశాభివృద్ధి లేదు

దేశాభివృద్ధి కాంగ్రెస్‌ అజెండాలో ఏనాడూ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆ పార్టీ ఎన్నడూ ఆలోచించదని ఎద్దేవా చేశారు.

Published : 25 Feb 2024 04:08 IST

కుటుంబం గురించే ఆ పార్టీ నిరంతర తపన
నాకు మాత్రం ప్రజలే కుటుంబం: మోదీ

రాయ్‌పుర్‌: దేశాభివృద్ధి కాంగ్రెస్‌ అజెండాలో ఏనాడూ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆ పార్టీ ఎన్నడూ ఆలోచించదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.34,400 కోట్ల అభివృద్ధి పనులకు శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ప్రసంగించారు. ‘‘స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ మన దేశాన్ని దీర్ఘకాలం పాలించింది. మళ్లీమళ్లీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉండేదే తప్పిస్తే దేశ భవిష్యత్తును నిర్మించడం, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి కాదు. ఈరోజుకు కూడా ఆ పార్టీ దశ, దిశ మునుపటిలానే ఉన్నాయి. ఆ ఆలోచనలు ఆ పార్టీ నుంచి పోవు. అంతకుమించి ఆ పార్టీ ఆలోచించడం మరచిపోయింది. ఎంతసేపూ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకునేవారు. వాళ్ల కుమారులు, కుమార్తెల భవితను తీర్చిదిద్దడంలో మాత్రమే తలమునకలైనవారు మీ పిల్లల కోసం ఏమాత్రం ఆలోచించరు. కానీ ఈ మోదీకి.. మీరంతా కుటుంబమే. మీ కలలే నా సంకల్పం. అందుకే వికసిత భారత్‌, వికసిత ఛత్తీస్‌గఢ్‌ కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేనొక ప్రజా సేవకుడిని. మన పూర్వీకులు కన్న కలలకు తగ్గట్టుగా దేశాన్ని మారుస్తామని పదేళ్ల క్రితం హామీ ఇచ్చాను. తదనుగుణంగానే సరికొత్త భారత్‌ను నిర్మించాం’’ అని ప్రధాని చెప్పారు.

రూ.1.25 లక్షల కోట్లతో గిడ్డంగులు

దిల్లీ: సహకార రంగంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద గిడ్డంగుల ప్రణాళికను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఆవిష్కరించారు. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో వీటిని నిర్మించనున్నారు. 11 రాష్ట్రాల్లో 11 ‘ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం’ (పీఎసీఎస్‌) గోదాముల్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిపాదిత ప్రణాళిక కింద ఏడు కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం అయిదేళ్లలో అందుబాటులోకి వస్తుందని ప్రధాని వివరించారు. రూ.2,500 కోట్లతో దేశంలో 18 వేల పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని