రాయలసీమలో 31/55.. కోస్తాలో 68/120

తెదేపా- జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో చాలా జిల్లాల్లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు స్థానాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.

Published : 25 Feb 2024 05:49 IST

చాలా జిల్లాల్లో మెజార్టీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన

ఈనాడు, అమరావతి: తెదేపా- జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో చాలా జిల్లాల్లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు స్థానాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో 55 అసెంబ్లీ స్థానాలుంటే 31 చోట్ల స్పష్టత వచ్చింది. రాయలసీమలో తెదేపాకు బలమైన నాయకత్వం ఉండటంతో పాటు భాజపా, జనసేన నుంచి పెద్దగా డిమాండ్‌ లేదు. నంద్యాల జిల్లాలో ఆరు స్థానాలకు నందికొట్కూరు మినహా అన్నిచోట్లా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాలకు అనంతపురం అర్బన్‌, గుంతకల్లు మాత్రమే మిగిలాయి. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, పుంగనూరు మినహా అన్ని స్థానాలూ ఖరారు కాగా, తిరుపతి జిల్లాలో రెండు స్థానాలపైనే స్పష్టత వచ్చింది.

  • వైయస్‌ఆర్‌ జిల్లాలో పులివెందులతోపాటు మరో రెండు చోట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. పులివెందులలో గతంలో పోటీచేసిన సతీష్‌రెడ్డి మళ్లీ తెదేపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపినా చంద్రబాబు అంగీకరించలేదు. విధేయుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)కే అవకాశం కల్పించారు.
  • అన్నమయ్య జిల్లా రాయచోటిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేశ్‌కుమార్‌రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బావ, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ఇద్దరూ సీటు ఆశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా వైకాపా నుంచి వచ్చిన రాంప్రసాద్‌రెడ్డికి తెదేపా నుంచి అవకాశం దక్కింది.
  • తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి శంకర్‌యాదవ్‌తో పాటు లక్ష్మీదేవమ్మ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి టికెట్‌ ఆశించారు. చివరకు జయచంద్రారెడ్డిని ఎంపిక చేశారు.
  • మైదుకూరు టికెట్‌ కోసం మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రయత్నించినా.. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరు ప్రకటించారు.
  • కల్యాణదుర్గంలో 2019లో ఓడిపోయిన ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి పోటీ పడ్డా, విస్తృత పరిచయాలున్న అమిలినేని సురేంద్రను బరిలో నిలిపారు.
  • కోస్తా జిల్లాల్లో 120 అసెంబ్లీ సీట్లకు 68 చోట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో ఆరు స్థానాలకు ఐదు చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, చీరాల మాత్రమే పెండింగ్‌లో ఉంది. గత ఎన్నికల్లో అక్కడి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
  • కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 14 స్థానాలకు 10 చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పశ్చిమ, మైలవరం స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. మైలవరంలో బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఇంకా తేల్చలేదు. కృష్ణా జిల్లాలో పెనమలూరు, అవనిగడ్డ మాత్రమే మిగిలాయి.
  • గుంటూరు జిల్లాలో ఏడు స్థానాలకు నాలుగు చోట్ల తెదేపా, ఒకచోట జనసేన అభ్యర్థుల పేర్లు వెలువడ్డాయి. మరో రెండు స్థానాలు మాత్రమే మిగిలాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని