ఆ కుటుంబాల నుంచి ఒక్కొక్కరే..

ఒక్కో కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెదేపా మొదటి జాబితాను పరిశీలిస్తే కన్పిస్తోంది.

Published : 25 Feb 2024 04:24 IST

ఈనాడు, అమరావతి: ఒక్కో కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెదేపా మొదటి జాబితాను పరిశీలిస్తే కన్పిస్తోంది. కొంతమంది నాయకుల కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది. కోట్ల కుటుంబంలో సూర్యప్రకాశ్‌రెడ్డికి డోన్‌, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా, అధిష్ఠానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది.

  • మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గత ఎన్నికల్లో తనకు, తన కుమారుడు విజయ్‌కు టికెట్లు అడిగారు. అప్పుడు అయ్యన్నకు మాత్రమే టికెట్‌ ఇచ్చారు. ఈసారి రెండు సీట్లు ఇవ్వలేకపోతే, తనకు బదులు కుమారుడు విజయ్‌కు కేటాయించాలని కోరారు. ఈసారి కూడా మీరే పోటీ చేయండంటూ అయ్యన్నకే నర్సీపట్నం టికెట్‌ను ఖరారు చేసింది.
  •   అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ అనంతపురం లోక్‌సభ స్థానంలో, ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి బరిలో నిలిచారు. ఈసారి తాడిపత్రిలో అస్మిత్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. జేసీ అల్లుడు దీపక్‌రెడ్డి రాయదుర్గం నుంచి పోటీకి ఆసక్తి కనబరిచారు. అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుకే టికెట్‌ ఇచ్చారు.
  • అశోక్‌ గజపతిరాజు కుటుంబం నుంచి 2019లో అశోక్‌ విజయనగరం లోక్‌సభ స్థానానికి, ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు. ఈసారి పోటీ చేయనని అధిష్ఠానానికి అశోక్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ కుటుంబం నుంచి అదితి మాత్రమే విజయనగరం అసెంబ్లీ బరిలో దిగనున్నారు.
  • పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపునిచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయనుండగా, మంగళగిరి నుంచి లోకేశ్‌ మరోసారి బరిలో దిగనున్నారు. చంద్రబాబు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణకు మరోసారి హిందూపురం టికెట్‌ ఖరారు చేశారు. బాలకృష్ణ రెండో అల్లుడైన శ్రీభరత్‌కు విశాఖపట్నం లోక్‌సభ స్థానాన్ని కేటాయించే అవకాశముంది.
  • కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడికి మరోసారి టెక్కలి టికెట్‌ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడిని తిరిగి లోక్‌సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు ఈసారి టికెట్‌ ఖరారు చేశారు. రామ్మోహన్‌నాయుడు మామ అయిన బండారు సత్యానారాయణమూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశముంది.
  •  మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ వియ్యంకులు. వీరిద్దరూ తెదేపా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు నుంచి నారాయణ, విశాఖ ఉత్తరం నుంచి గంటా పోటీ చేశారు. ఈసారి నారాయణకు నెల్లూరు నగర సీటును ప్రకటించారు. గంటా పేరును చీపురుపల్లికి పరిశీలిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని