నాటి సభాపతి ఒకరు.. మాజీ మంత్రి మరొకరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు సభాపతిగా వ్యవహరించినవారు ఒకరు, ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగానూ అనుభవం ఉన్న వారు మరొకరు.

Updated : 25 Feb 2024 05:16 IST

ఉన్నత విద్యావంతురాలైన మహిళ ఇంకొకరు
జనసేన అభ్యర్థుల నేపథ్యమిదీ..

ఈనాడు, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు సభాపతిగా వ్యవహరించినవారు ఒకరు, ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగానూ అనుభవం ఉన్న వారు మరొకరు. ఉన్నత విద్యావంతురాలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించిన మహిళ ఒకరు. ఇలా జనసేన తన తొలి జాబితాలోనే గట్టి ముందడుగు వేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం అయిదుగురి పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు. తెదేపాతో పొత్తులో భాగంగా మొత్తం 24 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న జనసేన  అయిదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇందులో నలుగురు గతంలో పోటీ చేసినవారే.

  •   తెనాలి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయబోతున్న నాదెండ్ల మనోహర్‌ (58) ఎంబీఏ చదివారు. తెనాలి నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు.
  •  అనకాపల్లి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఖరారైన కొణతాల రామకృష్ణ (67) సీనియర్‌ రాజకీయ నేత. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2009 తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
  • నెల్లిమర్ల జనసేన టికెట్‌ దక్కించుకున్న లోకం మాధవి ఉన్నత విద్యావంతురాలు. ఇస్రోలో ప్రోగ్రామర్‌గా, ఫోర్డ్‌ కంపెనీలో డేటా ఆర్కిటెక్టుగా పని చేశారు. అనంతరం మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ను స్థాపించారు. మిరాకిల్‌ పేరుతో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ (62) జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన విద్యార్హత ఇంటర్మీడియట్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే స్థానం నుంచి 2019లోనూ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
  • తూర్పుగోదావరిజిల్లా  రాజానగరం జనసేన టికెట్‌ ఖరారైన బత్తుల బలరామకృష్ణ (50) పదో తరగతి చదువుకున్నారు. వ్యాపారం చేస్తుంటారు. నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని